జీవితంలో ఎప్పుడూ ఒకే స్థితి ఉండదు.
ఎదిగి ఒక స్థాయికి చేరిన ప్రతివ్యక్తికి, గతం సామాన్యంగానే ఉంటుంది.
ఆ గతంలో ఎన్నో ఒడుదుడుకులు, ఆటుపోట్లు తట్టుకొని, క్రమంగా నేడు ఒక ఉన్నతస్థితికి చేరగాలిగాడు.
అయితే గతంలో తనకి సహకరించిన వారిని, స్నేహితులని మరవకుండా గుర్తుపెట్టుకొని, వారిని సంతోషపరచడం ఒక సంస్కారం. ఎంత ఎదిగినా గతాన్ని విస్మరించని ఉత్తములు కొందరుంటారు.
భాగవతంలో శ్రీకృష్ణుని నుండి నేర్చుకోవలసిన గొప్ప సంస్కారాల్లో ఇది ఒకటి. ద్వారకా పురాధీశుడై, విఖ్యాతుడై, సంపన్నుడై విరాజిల్లుతున్న పరమాత్ముని వద్దకు దరిద్ర పీడితుడైన కుచేలుడు వచ్చినప్పుడు, ఆ స్వామి ప్రవర్తించే తీరు అద్భుతం.
చిన్ననాటి ఆ మిత్రుని పరమప్రేమగా ఆదరించి, గత స్మృతుల్ని తానె గుర్తుచేసి మన్నించాడు. ఎక్కడా తన సంపద్ధర్మాన్ని ప్రదర్శించకుండా, ఎంతో వినయంగా సన్మానించిన శ్రీకృష్ణుడు మర్యాద పురుషోత్తమునిగా భాసించాడు.
ఎంత ఎత్తుకు ఎదిగినా తన పునాదుల్ని మరువని ఔదార్యానికి ఇదో మచ్చు తునక.
ఇదిలా ఉండగా సమాజంలో మరో కోణాన్ని కూడా ఈ అంశంలో పరిశీలించవచ్చు. ఎవరైనా ఒక ప్రసిద్ధ వ్యక్తి ఉన్నప్పుడు – అతడిని గతంలోనో, చిన్ననాడో ఎరిగిన వారు – “అతడా? నాకు బాగా తెలుసు” అని వెంటనే అంటారు. ఇందులో ‘బాగా’ అనేది ఎంత మేరకు?- అన్నది దేవుడికెరుక.
పైగా ఎదిగిన ఆ వ్యక్తీ తనని బాగా ఆదరించాలని వారు ఆశిస్తారు. అతడేదైనా హడావిడిలో ఉండి, తన మానాన తాను వెళుతున్నా, ‘ఇతగాడు మారిపోయాడు, పెద్దవాడయ్యాడని గర్వం” అని తక్షణం వ్యాఖ్యానిస్తారు.
అంతేకాదు, కాసింత గత పరిచయాన్ని ప్రగాఢస్నేహంగా చిలువలుపలవలుగా అల్లి చెబుతారు.
“ఆరోజుల్లో నా చుట్టూ తిరిగేవాడు, ఇప్పుడు చూసినా పలకరించడు” అంటూ మరికొన్ని కువిమర్శల్ని కూడా చేస్తారు.
అంతేగానీ, అతడి స్థితిగతుల్ని విచారించరు. ఏ ఒత్తిడిలో ఉన్నాడో, ఏ స్థితిలో ప్రవర్తిస్తున్నాడో అని కూడా ఆలోచించరు. కొందరైతే “ఆనాడు నా వల్లనే ఎదిగాడు, ఇప్పుడు కన్నెత్తయినా చూడడు” అని ఎత్తిపొడుస్తారు.
తన అభివృద్ధికి దోహదపడిన వారిని సమాదరించడం ప్రధాన కర్తవ్యమే – కాదనలేము. కానీ ఎవరి సహకారం ఎంతమేరకు? వారికి ప్రత్యుపకారం ఏ పరిధి వారు? అనే పరిమితులు కూడా ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా, వీసమెత్తు సాయానికి జీవితాంతం సన్మానాన్ని ఆశించడం అత్యాశే కదా!
ఒక చెట్టు మొక్క దశలో ఇనుపకంచె రక్షణగా ఉంటుంది. అది ఎదిగిన తరువాత కూడా ఆ కంచే పరిధిలోనే ఉండాలని, కంచెను వదలరాదనీ నిర్దేశించడం సరియైన పధ్ధతి కాదు. గతంలో నిక్కర్లు వేసుకున్న వాడు ఎదిగాక సూటు వేసుకోవచ్చు. ఆ స్థితిలో కూడా నిక్కర్లని విస్మరించాడని ఎత్తి పొడవడం లాంటి అజ్ఞానం కొందరు చేస్తుంటారు.
ఇలాంటి వారి విమర్శల్ని ఎదుర్కొనడం సమాజంలో కాస్త స్థాయి కలిగిన ఏ ఒక్కరికైనా ఎదురయ్యే సమస్యే! ఒక్కొక్కసారి ఈ ‘దెప్పిపొడుపు రాయుళ్ళు” కక్షసాధింపులకి కూడా తెగిస్తారు.
ఇటువంటి వారి చర్యలకి మనస్సును గాయపరచుకుంటే అంతా అశాంతే. తనేమిటో తనకే బాగా తెలుసు.
నిజంగా ఉన్నతికి హేతువైన వారిని ఏ వ్యక్తీ మరవకుండా ఉండడానికి, వీలైనంత ప్రత్యుపకృతి చేయడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అలాంటి లక్షణం లేకపోతె, ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా అలాంటి సంస్కారాన్ని అలవరచుకొని పెంపొందించుకోవాలి. దీనిని కృతజ్ఞతాధర్మం అంటారు.
ఏనాడో వాయుదేవుడి వల్ల కాపాడబడినందుకు మైనాక పర్వతం వాయుపుత్రుడైన హనుమను ఆదరించి, ఆతిధ్యమిచ్చేందుకు సిద్ధపడ్డాడు. తన ఉనికికి ఆధారమైన సగరుల పట్ల కృతజ్ఞతతో సాగరుడు ఆ వంశానికి చెందిన శ్రీరామునకు ప్రత్యుపకారం చేసేందుకు సన్నద్ధుడయ్యాడు.
“కృతేషు ప్రతి కర్తవ్యమ్ ఏషధర్మస్సనాతనః”
అని వాల్మీకి మాట. ఉపకారం చేసిన వారికి తిరిగి మేలు చేయడం సనాతన ధర్మం. ఇలాంటి మాటలు ప్రతివారూ గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ హనుమంతుడు గానీ, రాముడు గానీ మైనాకునీ, సాగరుని గాని ఆశించలేదు. దెప్పి పొడవలేదు. చిన్నపాటి సాయం చేసి, జీవితాంతం ఏదో ఆశిస్తూ, విమర్శిస్తున్న వారు దీనిని గుర్తు పెట్టుకోవాలి.
ఉపకారమైనా, ప్రత్యుపకారమైనా మనం ఆశించేది కారాదు, ఆచరించేది కావాలి.
ఏది చేసినా, ఎలా ఉన్నా ఏదో ఒకటి ఎత్తిపొడిచే వారు ఉంటూనే ఉంటారు. అటువంటి వారిని ఉపేక్షిస్తూ, మన కర్తవ్యాన్ని మనం చేస్తూ సాగడమే జీవితం.
ఇటువంటి ఎగతాళి, విమర్శలు, మహామహులకే తప్పలేదు – అనే ఎరుక మనకి ఉంటే నిశ్చింతగా ఉండగలం.
ప్రయత్నపూర్వకంగా ఏ ఒక్కడినీ నిరాదరించడం తగదు. మనకి తెలిసినంత మేరకు, సాధ్యమైనంత వరకు అవతలి వారిని గుర్తించడం, ఆదరించడం చేయవలసినదే. మన ఎరుకలో లేకుండా జరిగిన వాటిని వక్రీకరించి చూసే వారిని మనం ధ్యాసలో పెట్టనవసరం లేదు.
జీవన ప్రస్థానంలో ఇవన్నీ చేరువై, దాటిపోయే మజిలీలే. మన కర్తవ్యాన్నీ కృతజ్ఞతా బుద్దినీ విడువకుండా సముచితంగా ప్రవర్తించితే, భగవంతుడు సంతోషిస్తాడు.
0 Comments