Breaking News

6/recent/ticker-posts

ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర - Chatrapati Shivaji Life Story in Telugu (Part 1)


'ఇది మా ఖర్మ. మా నుదుట మాకిలాగే వ్రాసి ఉందేమో' అనుకుంటూ స్వరాజ్యం, స్వాతంత్ర్యం అనే పదాలనే మరిచిపోయారు.

రోమ్,గ్రీక్,పర్షియా, ఈజిప్టు వలెనే హిందుస్థాన్ ధర్మ సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయే కాలం సమీపించిందా?

క్రీ శ 675 లో మహ్మద్ బిన్ ఖాసిం మొదలు గజినీ(క్రీ శ 1001), ఘోరీ(క్రీ శ 1193) ఖిల్జీ(క్రీ శ 1293) ల దాడులతో భారతీయ జీవనవృక్షం కూకటి వ్రేళ్ళతో కూలిపోవడం మొదలైంది. ఉన్న ఒకే ఒక్క విజయనగర హిందూ సామ్రాజ్య వైభవం అంతరించింది.

రాజా తోడర్ మల్, రాజా మాన్ సింగ్ మొదలైన రాజులు, మహరాజులు కూడా మనోబలం కోల్పోయి మొఘలులు, ఆదిల్ షాహీ,నిజామ్ షాహిలకు ఊడిగం చేశారు. సుమారు 500 సంవత్సరాలకు పైగా కోట్లాది హిందువులు నిరాశా నిస్పృహలతో జీవనం గడపటం సాధారణ విషయం కాదు. డిల్లీ లో ఔరంగజేబు పాలనతో ప్రజలు మరింత విసిగి వేసారి పోయారు. ఇదే సమయంలో పశ్చిమ సముద్ర తీరం లో పోర్చుగీసు,డచ్చి వారు,ఫ్రెంచ్,ఇంగ్లీష్ వారు స్థావరాలు ఏర్పరచుకున్నారు.

హిందువులు 'ఇది మా ఖర్మ. మా నుదుట మాకిలాగే వ్రాసి ఉందేమో' అనుకుంటూ స్వరాజ్యం, స్వాతంత్ర్యం అనే పదాలనే మరిచిపోయారు.
హిందూ రాజులు విధర్మియుల ప్రక్కన చేరి తోటివారినే చంపే దౌర్భాగ్యం తలెత్తింది.

రోమ్,గ్రీక్,పర్షియా, ఈజిప్టు వలె హిందుస్థాన్ ధర్మ సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయే దిశలో దేశమంతటా అంధకారం అలుముకున్నది.
శివుని ఆవిర్భావం
పశ్చిమ సముద్ర తీరాన సహ్యాద్రి కొండల గర్భంలో ఒక బాలుడు ఉదయించాడు. స్వాభిమానం గుండెల్లో నింపుకుని బిజాపూర్ సుల్తాన్ కి సలాం చేయడానికి తిరస్కరించాడు. హైదరాబాద్ కుతుబ్ షాని తల వంచేలా చేశాడు. డిల్లీ పాదుషాను భయాందోళనలకు గురి చేశాడు.అప్పుడప్పుడే స్థావరాలు ఏర్పరచుకుంటున్న తెల్ల జాతులవారికి దిగ్బంధనం విధించాడు.
క్రీ శ 1630 లో జీజా కు జన్మించిన శివాజీ, వేస్తున్న ప్రతి అడుగు లో హిందూ ధ్వజం పైపైకి ఎగురుతునే వుంది. దాదాజీ ఖొండ దేవ్ శిక్షణ లో రాటుదేలి,హైందవ సామ్రాజ్య స్థాపనకు శివుడి ముందు రక్తతర్పణతో ప్రతిన చేసి, మడమ వెనక్కి త్రిప్పకుండ మునుముందుకు సాగుతూ హిందువుల రక్షకుడయ్యాడు.

మావళీలలో స్వరాజ్య కాంక్ష ను రగిలించి తోరణ,కల్యాణ దుర్గాలను స్వాధీనం చేసుకున్నాడు. కల్యాణ కోట లో ముల్లా అహ్మద్ కోడలు దొరికినప్పుడు అమ్మా అని సంబోధించి కానుకలిచ్చి బిజాపూర్ కి పంపి హిందూ సంస్కారం అంటే ఏమిటో తెలియ చేశాడు. గోవులను కాపాడాడు. జనసామాన్యం మనస్సులను గెలిచాడు. తండ్రి షాజి ని బిజాపూర్ లో ఖైదు చేస్తె, డిల్లీ పాదుషా తో ఒత్తిడి తెచ్చి విడిపించాడు. బిజాపూర్ నుండి 35 వేల మంది సైన్యంతో బయలుదేరి, శివాజీ ని వదించడానికి, దారిలో తుల్జా భవాని,పండరీపురం మందిరాలు విధ్వంసం చేస్తూ వస్టున్న ఆరడుగుల అఫ్జల్ ఖాన్ ని ఒంటరిగా ప్రతాప్ గడ్ దగ్గర లోని శామియానా లొకీ పిలిపించి,పులి గ్రొళ్లతో కడుపును చీరి,తల నరికి అమ్మ జిజీ కి సమర్పించాడు.

లక్ష సైన్యంతో డిల్లీ నుండి ఔరంగజేబు ఆదేశం మేరకు షాహిస్తా ఖాన్ పుణే కోటను ఆక్రమిస్టే,రాత్రి పూట ఒక్కడే ఖాన్ వుండే లాల్ మహల్ గదిలోకి వెళ్లి కుడి చేతి మూడు వ్రేళ్ళు నరికిన శివాజీ నిజంగానే శత్రు భయంకరుడు.

ఇటువంటి అపూర్వ విప్లవం శివాజీకి ఎలా సాధ్యమైంది?
అన్ని కులాల బాలురు, యువకులతో కలిసి తిరగడం, ఆటలాడటం, జొన్న రొట్టె,పప్పు, ఉల్లిపాయలతో కడుపు నింపుకొవడం,రామాయణ భారత భాగవత కథల్లోని వీర రస గాధలు అమ్మ, గురువుల ద్వారా విన్నవి మెదడులో కదలాడుతుంటే, భవిష్యత్ స్వరాజ్య స్వప్నాన్ని దర్శిస్తు, జనాన్ని ఒక్కటిగా చెసి, దేశభక్తి,దైవభక్తిని ఉచ్వాస నిస్వాసాలుగా భావించిన శివాజీ దేశం లో ఒక నూతన ధార్మిక దృష్టిని అందిచ్చాడు.

తనను నమ్ముకున్న మిత్రులు యసాజీ,తానాజీ,బాజీ, నేతాజీ అలాగే మావలీల సావాసాన్ని మరువక వారి సామర్థ్యాన్ని పెంచి, 500 లేదా 1000 మంది సైన్యంతోనే విదేశీయుల వేల,లక్షల సైన్యాన్ని మట్టి కరిపించే గెరిల్లా యుద్ద తంత్రాన్ని ప్రవేశ పెట్టి,ఇటు బిజాపూర్ సుల్తాన్, అటు డిల్లీ పాదుషా లను చావు దెబ్బ కొట్టాడు. 80 ఏళ్ల తానాజి నేతృత్వంలో సింహ గడ్ కోటను గెలిచాడు. శివాజీని ఆగ్రాలొ ఖైదు చేసి మట్టు పెట్టాలని ఔరంగజేబు కుట్ర పన్నినప్పుడు,తెలివిగా పండ్లబుట్టలో దాక్కుని తప్పించుకున్నాడు.

గురువుల ఆశీర్వాదం - శివాజీ పట్టాభిషేకం
ఆధ్యాత్మిక గురువులైన భక్త తుకారాం, సమర్థ రామదాసు చెంతలో వైరాగ్యం తో వుండి,ప్రశాంతత ను పొందాడు. స్వామి రామదాస కి తాను గెలిచిన రాజ్యమంతా గురు దక్షిణ గా ధారపోశాడు. అప్పుడు రాజ్య ధర్మ కర్తగా వుండమని సమర్థ రామదాసు స్వామి ఆదెశించినప్పుడు, 1674 జ్యేష్ట శుద్ద త్రయోదశి రోజున , గెలిచిన 300 కోటలకు కేంద్రమైన రాయ్ గడ్ లో కాశీ పండితుల చేతుల మీదుగా రత్న ఖచిత చత్రాన్ని శివాజీకి సమర్పించగా, వేలాది పండితుల వేద మంత్రాల సాక్షిగా పట్టాభిషేకం జరిగింది. అంగరంగ వైభొగంగా వీధుల్లో ఊరేగింపు జరిగింది. స్వరాజ్యం సాధించి సురాజ్య - సుపరిపాలన వైపు అడుగులు వేసిన వాడు ఛత్రపతి శివాజీ.

హిందూ అని చెప్పుకోవడానికే భయం గొల్పె పరిస్థితి నుండి హిందువు కూడా రాజ్యం చేయగల సమర్థుడని లోకానికి చాటిన వాడు, కేవలం మహరాష్ట్రలోనే కాదు ఆసేతు హిమాచలం జనం గుండె గుండెలో స్వాభిమానాన్ని నింపి, 500 సంవత్సరాలుగా కొడిగట్టిన హైందవ జ్యోతిని వెలిగించి, దిగ్దిగంతాలు ప్రసరింపచేసిన సాక్షాత్ శివుడి అవతార పురుషుడు ఛత్రపతి శివాజీని మన హృదయంలో ప్రతిష్టాపించుకుందాము.

జై భవానీ - వీర శివాజీ



శ్రీ అప్పాల ప్రసాద్

(రచయిత - తెలంగాణ కన్వీనర్, సామాజిక సమరసతా వేదిక)



Post a Comment

0 Comments