వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః
స్కందాగ్రజోవ్యయః పూతో దక్షో ధ్యక్షో ద్విజప్రియః !!
అగ్నిగర్వచ్ఛిదిందశీప్రదో వాణీప్రదో వ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః !!
సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః
శుద్ధో బుద్ధి ప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః !!
అగ్నిస్వరూపుడు,
మూషిక వాహనుడు, ఉండ్రాళ్ల ప్రియుడు, బ్రహ్మచారి, సిద్ధి – బుధ్ధిప్రదాత
గణేశుడు.
వినాయక చవితి సందర్భంగా అయన అసలు తత్వం ఏమిటో సశాస్త్రీయంగా వేద ప్రామాణికంగా తెలపడమే ఈ వ్యాసోద్దేశ్యం.
గణేశుడిలో – గణేశ పూజలో దాగిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఏటా భాద్రపద శుక్ల చతుర్దశి నాడే వినాయకుని చవితి పండుగ ఎందుకు జరుపుకోవాలంటే అయన ఆ రోజున గజాసురుని చంపి గణాధిపత్య హోదాను పొందిన రోజనేది పురాణవచనం. వాస్తవానికి శ్రావణం, భాద్రపదం అంటే జూలై 20 నుండి సెప్టెంబరు 20 మధ్యకాలం చాలా వేడిగా ఉండి అత్యధిక తేమ ‘హ్యూమిడిటీ’ కలిగి భారీ వర్షాలు కురుస్తాయి. ఇవి శ్వాస, ఎముక సంబంధిత వ్యాధులను తిరగబెట్టె కాలంగా ఆనాడే గుర్తించారు. కొందరికి ఈ వ్యాధులు కొత్తగా మొదలయ్యే కాలం కూడానూ. గణేశ పూజలో ఉపయోగించు ‘‘పత్రీ-నైవేద్యాలు’’ పైన పేర్కొన్న రోగాల నిర్మూలకాలు. కనుకనే గణపతి పూజలో అలవాటుగా వాడే పూల స్థానంలో పత్రీ పూజను నిర్దేశించారు పెద్దలు. గణేశ ప్రతిమా జల నిమజ్జనంలో కూడా ఈ పత్రీ స్థానం, ప్రాముఖ్యత ఏమంటే, వానకాలపు నీటి కాలుష్యాలను నివారించేందుకు నిర్దేశించినదే. ఇక ‘‘చవితి’’ అనే తిథిలోని సైన్స్ ఏమంటే-ఈ తిథిని ‘‘రిక్త’’ లేదా ‘‘శూన్య తిధి’’ అంటారు. ఇక్కడ శూన్యం అంటే అనంతమైన అంతరిక్షం ‘‘స్పేస్’’ మొత్తమని అర్థం. అంటే గణేశుడు ‘‘ఈథర్’’ అనబడే ఆకాశతత్వం కలిగిన దేవుడు. సర్వత్రా వ్యాపించి ఉండేవాడు సర్వలోక పూజలు అందుకునే దేవుడు. చతుర్దశి తిథికి అధిపతి బుధుడు. జ్ఞాన-విద్యకు కారకుడు. అందుకే ఈ బుధుడు పాలించే చతుర్ధి తిథి నాడు జరుపుకునే గణేశ పూజ రెండు విధాలుగా లాభదాయకం. ఒకటి ఆరోగ్యపరంగా, రెండోది ఆర్థిక పరంగా. ఈ తిథి నాల్గోది అంటే గణేశ పూజను నాలుగు లోకాలలో నివసించేవారు ఆచరిస్తారు.
చైత్ర మాసం నుంచి భాద్రపదం ఆరో మాసం. ఈ ఆరు అనేది సంఖ్యాశాస్త్ర దృష్ట్యా
బ్యాంకు రుణాలూ, ఉద్యోగాల్లో ప్రమోషన్స్, కొత్త ఉద్యోగంలో ప్రవేశం, తల్లి
తరపు బంధువులకు క్షేమకరం, రోగ నిరోధకం వంటి ప్రయోజనాలను కలుగచేస్తుంది.
వీటికి సైతం బుధుడే కారకుడు. కనుక భాద్రపదాన్ని, చవితి తిథిని గణేశపూజకు
ప్రశస్తమైనదిగా ఋషులు నిర్ణయించారు. భాద్రపదంకి ముందున్న శ్రావణంలో గణేశుడి
తల్లి మంగళగౌరీ, మేనత్త వరలక్ష్మీ పూజలు వస్తాయి. తల్లి పూజ తదుపరి
వచ్చేది తనయుడి పూజ కావడం వలన ఇది విశేష ఫలప్రదంగా భావిస్తారు.
చవితినాటి చంద్రుని ప్రభావం మనో చాంచల్య ప్రదం. అంటే తొందరపాటు చర్యలను
తీసుకునేలా చేయగల శక్తిని కలిగి ఉంటుంది. అందువల్లే చవితి రాత్రి చంద్ర
దర్శనం కూడదని అన్నారు. మరి వ్రతం చేసి ఆయన కథ వింటే చంద్ర దర్శనం
చేయవచ్చునని చెప్పడంలోనూ రహస్యం దాగి ఉంది. బియ్యంతో చేసే అక్షింతలు
చంద్రునికి ప్రీతికరమైన ధాన్యం. వీటిని పసుపు లేదా కుంకుమతో తయారు
చేస్తుంటారు. ఈ పసుపు బృహస్పతైన గురుగ్రహ సంకేతం కాగా, ఎరుపు చంద్రుని
మిత్రుడు అంగారక-కుజ గ్రహ సంకేతం. వీరిద్దరూ చంద్రునికి మిత్రులే కావడం,
అవి తలపైన ఉండటం వలన చంద్రుని ప్రభావం మనసుపైన ఉండదు. గురుగ్రహం కూడా
గణేశుడివలె ఈథర్-ఆకాశతత్వం కలది. కనుక అక్షింతలను పసుపుతో చేయడమే అన్ని
విధాలా శ్రేయస్కరం.
గణేశ తత్వం
అగ్నికి ఏడు నాలుకలు. అందుకే ఆయన్ని ‘‘సప్త జిహ్యూడూ’’ అంటాం. ‘‘జిహ్వ’’
అంటే నాలుక. ఏడు నాలుకల అగ్ని ఏడు రూపాల్లో ఈ విశ్వమంతా విస్తరించి ఉంది.
ఇందులో ‘‘భౌమాగ్ని’’ ఒకటి. అంటే ఇది భూమి లోపల ఉంటుంది. ఋగ్వేద మంత్రంలో
గణేశుడి పేరు మూషిక ధ్వజుడని, ధూమ్ర ధ్వజుడని ఉంది. అగ్నినిని కూడా
ధూమ్రధ్వజుడంటారు. ఆకృతి రూపేణా చూస్తే ఎలుకను అంటే మూషికాన్ని ధూమ్రం
అంటారు. గణేశుడు మూషిక వాహనుడు అయితే, అగ్ని మూషిక రూపుడు. ఆదిలో సూర్యుని
నుంచి గ్రహాలు విడివడగా అగ్నికి చెందిన భౌమాగ్ని రూపం భూమిని
అంటిపెట్టుకొని ఉండిపొయింది. పరిణామక్రమంలో ఈ అగ్నిమూషిక రూపాన్ని దాల్చి
భూమిలోపల వెళ్లి స్థిరపడిందని తైత్తిరీయోపనిషత్తు వర్ణనల్లో ఉంది. ఈ అగ్నే-
అగ్ని పర్వతాల జన్మకు మూలం. గణేశుని ఎలుక వాహనం ఎక్కువగా ఉండేది భూమిలోని
కలుగులలోనే. ఈ కారణంగానే భూమిలో దాగిన అగ్నిని చూడడానికి గణేశుడు మకర
సంక్రమణ కాలంలో భూమిపైకి వస్తాడు. ఆ సమయంలో గణేశ హోమం / పూజలూ చేసినవారికి
ఏకకాలంలో ‘‘అగ్ని -గణేశులు’’ ఇద్దరినీ ఆరాధన చేసిన పుణ్యఫలం లభిస్తుంది.
అగ్నికి వలే గణేశుడికి ఇద్దరు తల్లులు. ఒకరు లక్ష్మీదేవి ‘మేనత్త తల్లితో
సమానమని నానుడి’, మరొకరు పార్వతి. అందువల్ల అగ్ని-గణేశులను
‘‘ద్వైమాతురులు’’ అంటారు. అగ్నికి అంతరిక్షం-పృథ్వి అనే వారు ఇద్దరు
తల్లులే. ఇక ‘‘అగ్నిమ్సముద్ర వాసనం’’ అంటోంది ఋగ్వేదంలోని మంత్రం. అంటే
అగ్ని సముద్రంలో బడబాగ్ని రూపంలో ఉంటుందని అర్ధం. ఈ కారణంగా అగ్నిరూపుడైన
గణేశుని నీటిలో నిమజ్జనం చేసే ఆచారం వచ్చింది.
కేతువు-గణేషుడూ-మూషికం
కేతుగ్రహం అధిదేవత గణేశుడు. కేతువుకే ధూమ్రుడని మరో పేరు. అంటే ‘‘పొగ’’ అని
అర్ధం. ‘‘చిన్నారీచ్ఛిట్టెలుకెలా భరించెరా లంబోదరా పాపం నీ కొండంత పెను
భారం’’ అని సినీకవి వేటూరి సందేహం. పొగ అంటే కేతువు ‘‘పొగ’’ వలే తేలికైన
వాడు కనుక ఎంత భారాన్నైనా ఇట్టె మోయగలడని ఒక అర్ధమైతే మరో కోణంలో పొగ అనేది
ఎప్పుడూ ఊర్ధ్వం (పైకి) మార్గంలో ప్రయాణిస్తుందనే భావంలో గణేశుడు
ముక్తి-మోక్ష మార్గాలను చూపే దేవుడని స్పష్టమవుతోంది. పై లోకాలు (ఊర్ధ్వ)
ముక్తి-మోక్ష స్థానాలని అందరికీ తెలిసినదే. ఎలుక వాహనంలో దాగిన గొప్ప
ఆధ్యాత్మిక సత్యమిది. ధూమ్రకేతువు అనేది గణేశుడి అవతార రూపాలలో కూడా
ఒకటికావడం విశేషం.
గరిక పూజలోని మర్మం
గరికకు కామ పరమైన కోరికలకు దూరంగా ఉంచే గుణం ఉంటుంది. అంతేకాక బ్రహ్మ చర్య
వ్రత నియమానికి బాగా సాయపడుతుంది. అందుకేనేమో గణేశుడు పరమ నైష్టిక
బ్రహ్మచారిగా ఇన్ని కోట్ల సంవత్సరాలుగా తన వ్రతనిష్ఠను అవిశ్రాంతగా,
నిరాఘాటంగా కొనసాగిస్తున్నాడు. మానవ దేహంలోని ఆసన భాగంలో ఉండే మూలాధార
చక్రానికి గణపతి అధిపతి. అంటే మోక్ష మార్గపు మొదటి మెట్టు వినాయకుడే.
అంతేకాదు గణపతి అగ్నిశక్తి సంసారంకి మూల కారణమైన వీర్య శక్తిని ఇస్తూ
సృష్టి క్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తోంది. గణపతి అధర్వ శీర్షంలో దీనికి
సాక్ష్యంగా, నిదర్శనంగా ‘‘త్వాం మూలాధారస్థితో ఆగ్నిర్నిత్యం’’ అని ఉంది.
కనుకనే గరిక పూజ గణేశునికి ఎంతో ఇష్టం.
ఉండ్రాళ్ల పరమార్ధం
21 ఉండ్రాళ్లను గణేశుడుకి నైవేద్యంగా సమర్పిస్తాం. దేవుడు ఏక వింశతి రూపుడు
అనగా 21 అవతారాలు కలవాడు. గణేశుడి అవతారం 21. ఈ 21 ఉండ్రాళ్లలో ఒకటి
గణేశుడు వద్ద ఉంచి మిగిలిన ఇరవైలో 10 ని బ్రాహ్మణులకు ఇచ్చి, మిగిలిన 10
ఉండ్రాళ్లనూ ఇంటిలోని సభ్యులు తినాలనేది వినాయక వ్రత నియమం. బ్రాహ్మణుడు
ఎవరో కాదు సాక్షాత్తు అగ్ని దేవుని అంశం. కనుక ఆయనకు 10 ఉండ్రాళ్లు
ఇవ్వాలి. వినాయకుడికి ఇచ్చే ఒక ఉండ్రాయి పరమాత్మ ఒక్కడే అని చెప్పడానికి.
మనం తినే 10 ఉండ్రాళ్లూ జీవాత్మలకి సంకేతం. పరమాత్మయే పలు జీవాత్మలుగా
నివసిస్తున్నారనడానికే ఈ ఉండ్రాళ్ల నైవేద్యం.
సిద్ధి – బుధ్ధి
సిద్ధి-బుధ్ధి అయన భార్యలు. బుధ్ధి కలిగితే సిద్ధి కలుగుతుంది అని
చెప్పేందుకు గణేశుని ఉదాహరణగా చూపారు. అటువంటి ఘోటకపు బ్రహ్మచారికి సైతం ఒక
కూతురున్నది. ఆమె పేరు ‘‘సంతోషి’’. యజ్ఞం వలన వచ్చే పుణ్య ఫలాన్ని
‘‘సంతోషి’’ అంటారు. సంతోషి అంటే సంతోషిమాత కాదు. యజ్ఞం వలన అగ్నిరూపుడైన
గణపతి, సాక్షాత్ అగ్ని అయిన అగ్నిదేవుడూ ఇద్దరూ సంతృప్తి చెందటం వల్లా
వచ్చేదే ఈ పుణ్యఫలమైన సంతోషి.
తొలి రచయిత
గణపతి విశ్వంలోనే తొలి రచయిత కనుకనే పుస్తకాలూ- కలం ఆయన పూజలో పెడుతుంటారు.
చవితి రాత్రివేళ కొన్ని ఉండ్రాళ్లను ఇళ్ల మీదకు విసురుతుంటారు. దీని వెనుక
దాగిన కారణం వినాయకుని వాహనమైన ఎలుక తన యజమాని గణేశుడు నైవేద్య రూపంగా
ఎంగిలి చేసిన ఉండ్రాళ్ల ప్రసాదాన్ని తినడానికి రాత్రివేళ వస్తుందనే
భూతదయతోనే.
గుంజీలూ తీసే సంప్రదాయం
ఒకసారి వినాయకుడు మేనమామ విష్ణువును
చూడడానికి వెళ్లి ఆయన్ని ఆట పట్టించడంకోసం సుదర్శన చక్రాన్ని మింగేశాడు.
సుదర్శనాన్ని మింగిన గణేశుడికి ఏమన్నా అయితే శివ-పార్వతులకు తాను సమాధానం
చెప్పుకోవాలని శంకతో విష్ణువు, గణేషునిచేత మింగిన చక్రాన్ని కక్కించడానికి
తన రెండు చెవులూ పట్టుకొని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు. ‘‘ఇలా చెవులు
పట్టుకొని గుంజీలు తీయడాన్ని సంస్కృతంలో ‘దోర్భిఃకరణం’’ అంటారు’. అది చూసి
పక పక నవ్విన వినాయకుడి నోట్లోనుంచి ఆ చక్రం కింద పడింది. నాటి నుంచి
వినాయకుడి ఎదుట గణేశ వ్రతం రోజున ఎవరైతే గుంజీలు తీస్తారో వారికీ మేధస్సు –
తెలివితేటలు బాగా ఉంటాయని గణపతి వరమిచ్చాడు. ఈ ఘటన జరిగిననాటి నుండి
వినాయకుడికి ‘‘వికటచక్ర వినాయకుడ’’నే పేరు వచ్చింది. ఈ వికటచక్ర
వినాయకుడిని కేవలం కంచి ఆలయంలోని కుమార కొట్టం ప్రాంగణంలో నేటికి చూడవచ్చు.
- చల్లా జయదేవ్ (సీనియర్ జర్నలిస్ట్).
0 Comments