ఆగస్టు 29 మాతృభాషా దినోత్సవం సందర్భంగా
మనిషింటే ఏదో బతికేయడం కాదు. జీవించినందుకు సమాజం కోసం ఏదో చేయాలన్న తపన గల మహనీయులు అరుదుగానైనా ఉంటారు. ఆ కోవకు చెందిన గిడుగు రామమూర్తి పంతులు భాషామతల్లికి, ప్రధానంగా వాడుక భాష ప్రాచుర్యానికి జీవితాన్ని అంకితం చేశారు. ఈ మహాక్రతువులో ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. గ్రాంథిక భాషలో ఉన్న విజ్ఞానం కేవలం కొద్ది శాతం విద్యావంతులు, పండితులకే పరిమితం కారాదని, సామాన్యులకు కూడా అందాలని భావించారు. సాహిత్యం అందరికీ అందుబాటులోకి రావాలంటే మాట్లాడుకునే భాషలోనే రచనలు సాగాలని, బోధన కూడా వాడుక భాషలోనే ఉండాలని, భాషలోని మాండలికాలు సజీవంగా ఉండాలని, పత్రికలు కూడా మాట్లాడే భాషలోనే రాయాలన్నది ఆయన నిశ్చితాభిప్రాయం.
1906 నాటి ఆంగ్లేయుల ఏలుబడిలోని విద్యాశాఖ అధికారిగా వచ్చిన జె.ఎ.యేట్స్ దొరకు కలిగిన సందేహమే వాడుక భాషోద్యమానికి బీజం వేసింది. పుస్తకాలలోని తెలుగు భాషకు, వ్యవ హారంలోని భాషకు తేడా ఎందుకు? ఏమిటి? అని కొందరు పండితులను, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తిపంతులు లాంటి విద్యావేత్తలను అడిగి నప్పుడు వారి అభిప్రాయాలు చెప్పారు. గిడుగువారు మాత్రం ‘పుస్తకభాషకు, వాడుక భాషకు ఏ ఇతర భాషలో లేనంత వ్యత్యాసం తెలుగులోనే ఎక్కువగా ఉందనే అభిప్రాయం నాకూ కలిగింది. అయితే ఇతర కార్యాలవల్ల దానిని అంతగా పరిశీలించలేదు. మీరు చెప్పారు కనుక ఆలోచిస్తాను’ అని యేట్స్‌కు సమాధానమిచ్చారు.ఆ మరుక్షణం నుంచి దానిపై అధ్యయనం మొదలుపెట్టారు. నాలుగేళ్లపాటు రోజుకు కనీసం 16 గంటలపాటు శ్రమించి తెలుగుభాషలోని అన్ని కావ్యాలను, ప్రబంధాలను క్షుణ్ణంగా చదివారు.
నోటి మాటకు, చేతిరాతకు తేడా భాషా వికాసానికే అవరోధమని భావించి ఏదో చేయాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయుడిగా మూడు దశాబ్దాలు అనుభవం గడించిన తరువాత 1910లో 47వ ఏట పదవీవిరమణ చేసి వాడుక భాషా ఉద్యమాన్ని చేపట్టారు. వాడుక భాష ఆవశ్యకతపై ఒక సదస్సులో ప్రతిపాదించారు. దీనిపట్ల ప్రభుత్వం, విశ్వవిద్యాల యాలు కొంతమేర సుముఖంగా ఉన్నా పండిత లోకంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఆటంకాలు ఎదురవుతున్న కొద్దీ ఆయనలో పట్టుదల పెరిగింది. బాల్యమిత్రుడు, సహాధ్యాయి గురజాడ అప్పారావు, ఆంధ్రదేశంలో సంఘసంస్కరణ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆయన సంకల్పానికి అండగా నిలిచారు. కందుకూరి మొదట గ్రాంథికవాదాన్ని బలపరిచినా గిడుగు వాదనలోని వాస్తవాన్ని గ్రహించి, పత్రికలు ఎక్కువ మందికి చేరువ కావాలంటే అవి వ్యవహారిక భాషలో ఉండాలని భావించి తాము నిర్వహిస్తున్న ప•త్రికలలో ఆ శైలిని ప్రవేశపెట్టారు.
గిడుగు, గురజాడ వేర్వేరు కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. పర్లాకిమిడి అడవులలో తిరిగినప్పుడు దోమకాటుకు గురై, తీవ్ర జ్వరం వల్ల గిడుగు వినికిడిశక్తి కోల్పోగా, విజయనగరంలో రాజావారితో వ్యాహ్యాళికి వెళుతూ గుర్రం మీద నుంచి పడి గురజాడ గొంతు పోగొట్టుకున్నారు. దాంతో గురజాడ వారు గిడుగు వారికి చెవులైతే, గిడుగు వారు గురజాడకు గొంతుకయ్యారు. వారి ఆశయసాధనకు ఆ లోపాలు అడ్డుకాలేదు. అయితే 1915లో గురజాడ, ఆ తర్వాత నాలుగేళ్లకు కందుకూరి స్వర్గస్థులు కావడంతో భాషోద్యమ బాధ్యత గిడుగువారే వహించవలసి వచ్చింది. అయినా అధైర్యపడక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ, చేతికి వచ్చిన కుమారుడు సీతాపతి సహాయంతో వివిధ ప్రాంతాలు పర్యటించి చర్చలు సాగించి, వాడుకభాషపై తమ వాదనలను బలంగా వినిపించారు. గ్రాంథికవాదులను సమావేశపరచి, వారి గ్రంథాలు, కావ్యాలలోని కృత్రిమ పద ప్రయోగాలను, లోపాలను వెలికి తీసి సప్రమాణంగా నిరూపించారు. ‘భాష జీవనదిలాంటిది. పాతనీరు పోయి కొత్త నీరు చేరినట్లే భాషలోనూ మార్పులు సహజం. ఉన్న పదాలకు అర్థాలు (అర్థవిపరిణామం) మారవచ్చు. కొత్త పదాలు కొత్త అర్థాలతో చేరవచ్చు. మార్పులు చేర్పులు లేకపోతే అది భాషే అనిపించు కోదు. భాష నిరంతరం పరిణామం చెందు తుంటుంది. ఈ మార్పును ఎవరూ శాసించలేరు’ అని వివరించారు. ‘దేశంలో అక్షరాస్యులు నూటికి పదిమంది కంటే లేరు. ఈ స్వల్ప సంఖ్యాకులైన అక్షరాస్యులలో నూటికి ఒక్కరైనా కావ్యభాషను అర్థం చేసుకోగలవారున్నారో లేదో సందేహం. ఇట్టి పరిస్థితులలో విద్యావ్యాప్తికి పూనుకోదలచిన పెద్దలు, ఏ భాషలో కథలూ, ఉపన్యాసాలు, వ్యాసాలు, ప్రకటనలు మొదలైనవి రచిస్తే మంచిదో ఆలోచిం చాలి. కావ్యభాష అల్ప, పరిమిత ప్రయోజనం కలది. కనుక వ్యావహారిక భాషలో రచితములైన గ్రంథాలవల్లనే విద్యావ్యాప్తి ఎక్కువగా సాగగలదని నా అభిప్రాయం’ అని వివరించారు. ‘నన్నయ మహాభారతం మొదలు సమకాలీనం వరకు గల కావ్యాలను విద్యార్థులతో చదివించండి, అభ్యంతరం లేదు. కానీ ఆ కావ్యభాషలోనే వచనరచనను నిర్బంధంగా సాగించాలని పట్టుదల విడిచిపెట్టండి’ అని స్పష్టం చేశారు. ‘విజ్ఞానం ఏ కొద్దిమంది చేతిలోనో ఉండి పోయి అధిక సంఖ్యాకులు అజ్ఞానంలో కృశించనక్కర్లేదు. అది సమంజసం కూడా కాదు. ప్రజలకు వారి భాషలోనే విజ్ఞానాన్ని అందచేయాలి. కృతకభాషలో, ఇరుకు చట్రంలో విద్యను బిగించడం వల్ల అత్యధికులకు అన్యాయం జరుగుతోంది. చదువు, విజ్ఞానం కొందరికే బోధపడే స్థితి నుంచి బయట పడాలి. అందుకు వాడుక భాషే శరణ్యం’ లాంటి ఉపన్యాసాలతో గిడుగు గ్రాంథిక భాషాభిమానుల నుంచి అనేక అవమానాలు, తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు.1915 రాజమహేంద్రవరంలో ఆయన ప్రసంగానికి అడ్డుపడుతూ ‘గ్రామ్యమూర్తి’ అని హేళన చేశారట.‘మనం మాట్లాడుకొనేదే మన మాతృభాష’ అన్న ఆయన వాదనను చాలా మంది నిరసించారు. పవిత్ర గ్రాంథిక భాషను వ్యావహారిక ప్రయోగాలతో కలుషితం చేయడాన్ని ఆమోదించ•బోమని, గిడుగు తమ వితండవాదనతో సాహిత్యంలో అరాజకత్వాన్ని ఎగదోస్తున్నారని ఆక్షేపించారు. ‘గ్రాంథికం రాయడం చేతకాకనే వాడుక భాష అనే సులువైన మార్గాన్ని ప్రచారం చేస్తున్నా’రని కూడా ఆరోపించారు.
అక్షరాస్యతతోనే భాషాభివృద్ధి సాధ్యమని, మాతృభాషాభివృద్ది కోసం పాటుపడాలని, ఇంట్లో ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషను విస్మరించ కూడదని గిడుగు ఆనాడే చెప్పారు. తమ భాషా ఉద్యమాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు స్వీయ సంపాదకత్వంలో పర్లాకిమిడి నుంచి 1919-20 మధ్య ‘తెలుగు’ మాస పత్రికను ప్రారంభించారు. అందులో ఆయన రాసిన సంపాదకీయాలు, వ్యాసాలు తీవ్రచర్చలకు దారితీశాయి. చాలా మందిలో చైతన్యం నింపాయి. తర్వాత కాలంలో భాషా, పత్రికా రంగాల పరంగా పెనుమార్పులు తీసుకువచ్చాయి. కానీ పోషకులు లేక కేవలం 11 సంచికలతోనే ఆ పత్రిక నిలిచిపోయింది.
పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, తల్లావఝల శివశంకరశాస్త్రి, తాతా సుబ్బరాయశాస్త్రి, పేరి కాశీనాథశాస్త్రి, వాసా సూర్యనారాయణశాస్త్రి తదితర కవులు గిడుగు వారి శిష్ట వ్యావహారిక భాషావాదానికి మద్దతు తెలిపారు. వాడుక భాష క్రమంగా పత్రికలలో స్థానం సంపాదించుకుంది. కాశీనాథుని నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ‘ఆంధ్రపత్రిక’ వ్యావహారిక భాషకు సముచిత స్థానం కల్పించగా, అదే సంస్థకు అనుబంధ సాహిత్య మాస పత్రిక ‘భారతి’ రెండు రకాలు భాషలకు సమప్రాధాన్యం ఇచ్చింది. వర్తమాన తెలుగు పత్రికలు వాడుతున్న భాష నాటి ‘తెలుగు’ పత్రిక ప్రసాదంగానే భావించాలి. విశ్వవిద్యాలయాలలో బోధన, పాలనా వ్యవహారాలు వాడుకభాషలోనే సాగాలన్న గిడుగు కలలు కొంతవరకైనా సాకారమయ్యాయి. సిద్ధాంత వ్యాసాలను వ్యావహారిక భాషలో రాసే అవకాశం కలిగింది.
సవరలకు విద్యాప్రదాత
వాడుక భాష కోసమే కాదు, అడవితల్లి బిడ్డలను అక్షరాస్యులను చేయడానికి తపించారు గిడుగు. నాగరికతకు దూరంగా కొండకోనలలో నివసిస్తున్న వారికి విద్యా, విజ్ఞాన వికాసాల కోసం జీవితాన్ని అంకితం చేశారు. కుటుంబ పరిస్థితులు సహకరించక అంచెలంచెలుగా బి.ఎ. ఉత్తీర్ణులైన ఆయనకు ఉన్నత విద్యాభ్యాసం చేయాలని ఉన్నా ఇతరుల విద్యను ప్రోత్సహించేందుకు తమ విద్యాభిలాషను పక్కన పెట్టారు. పర్లాకిమిడి ప్రాంతంలో కొండలలో నివసిస్తున్న ఆదివాసిజాతితో పరిచయం పెంచుకొని వారి భాష, ఆచారవ్యవహారాలను పరిశీలించి, ఆ భాషను నేర్చుకున్నారు. సవరల భాష కృషిలో భాగంగా ఆడవులలో తిరగడం వల్ల చలి జ్వరానికి క్వినైన్ ఎక్కువ కావడంతో వినికిడి శక్తిని కోల్పోయారు. అయినా చివరి వరకు సవరల అభ్యున్నతికి పాటు పడ్డారు. పిల్లల కోసం సవర బడులు నెలకొల్పారు. కొందరు పిల్లలను తమ ఇంట ఉంచుకొని భోజనం పెట్టి చదువు చెప్పారు. సవరల కోసం తెలుగు లిపితో నిఘంటువులు రూపొందించారు. విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్.కళాశాలలో 1935 జనవరి 1వ తేదీన ఆంధ్ర విశ్వకళాపరిషత్ అప్పటి ఉపకులపతి, అనంతరం దేశ ప్రథమ పౌరుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ నిఘంటువులను ఆవిష్కరించారు. సవర వ్యాకరణం కూడా రాసి సవర వాగన శాసనుడిగా వినుతికెక్కారు. గిడుగు వారు వీటిని తమ బాల్యమిత్రుడు, జయపుర సంస్థానాధీశుడు విక్రమదేవవర్మకు అంకితమిచ్చారు (విక్రమదేవవర్మ గారిది కూడా గిడుగు వారి గ్రామమే).
జన్మభూమిపై అభిమానం
గిడుగు రామమూర్తికి అమ్మభాషన్నా, జన్మభూమి అన్నా మక్కువ ఎక్కువ. ఆయన పూర్వీకులు కోనసీమ లోని ఇందుపల్లికి చెందిన వారు. బతుకుతెరువు కోసం శ్రీకాకుళం ప్రాంతానికి తరలగా, ఉపాధ్యాయ ఉద్యోగానికి రామమూర్తి పర్లాకిమిడి చేరారు. 1936లో ఒరిస్సా రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పర్లాకిమిడిని ఆ రాష్ట్రంలో కలపవద్దని పట్టుపట్టారు. పర్లాకిమిడి రాజావారు రామమూర్తి పంతులుని విశేషంగా గౌరవించేవారు. కానీ పర్లాకిమిడి విలీనం చేయవద్దన్న ఆయన విన్నపాన్ని మాత్రం కొన్ని రాజకీయ కారణాలతో మన్నించలేదు. ఓఢ్రుల వైఖరితో సుమారు మూడు లక్షల మంది ఆంధ్రులు ఆ రాష్ట్రంలో కలిసిపోతూ ్పఅసంఖ్యాకులుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసేవారట. ఆ కొత్త రాష్ట్ర పౌరుడనని అనిపించుకోవడం ఇష్టంలేక రాష్ట్ర అవతరణకు ముందే ఆ ఊరును వీడాలని నిర్ణయించుకున్నారు. మహేంద్రతనయలో స్నానమాడి పర్లాకిమిడిని వదిలి మద్రాసు ప్రెసిడెన్సీలో చేరితే తప్ప తృప్తి లేదంటూ ఆ నది దాటిన తర్వాతే రైలు ఎక్కుతానని (పాతపట్నంలో) ప్రతిజ్ఞ చేశారు. దాదాపు ఐదున్నర దశబ్దాల పాటు నివసించిన ఇంటిని, ఊరును తృణప్రాయంగా వదిలేశారు. అయితే వృద్ధాప్యంలో ఆంధ్రదేశంలో ఎక్క డ స్థిరపడాలని మధన పడుతుండగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి విన్నపం మేరకు రాజమహేంద్రవరం చేరి స్థిరపడ్డారు.
1863 ఆగస్ల్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో పుట్టిన గిడుగు 77 ఏళ్ల జీవన ప్రస్థానంలో దాదాపు ఆరు దశాబ్దాల పాటు భాషా వికాసానికి విశేషంగా పాటుపడ్డారు. అప్పటి ప్రభుత్వం ‘రావు సాహెబ్’, ‘కైజర్-ఇ-హింద్- బిరుదులతో పాటు బంగారుపతక ప్రదానంతో సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘కళా ప్రపూర్ణ’తో సత్కరించింది. ఉమ్మడి ఆంధప్రదశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని ‘మాతృభాషా దినోత్సవం’గా ప్రకటించింది.
‘అయ్యో దేశభాషా! నిన్ను తృణీకరించడం చేతగదా నూటికి పదిమందైనా తెలుగు అక్షరాలు నేర్చులేకపోవడం, చదువు నేర్చిన వాళ్లయినా తెలుగు పుస్తకం పట్టుకోకపోవడం, ఇంగ్లీషు పుస్తకాలే ఎప్పుడూ చదవడం సంభవించినది. ఇకనైనా తెలుగువారు కండ్లు విప్పి చూతురా’ అని పంతులుగారు ఆనాడే బాధపడ్డారు. మాతృభాష విషయంలో నాటి-నేటి పరిస్థితులను బేరీజు వేసుకొని వారి ఆవేదనకు పరిష్కారం చూపడం ఆయన వారసులుగా మన కర్తవ్యం.
– డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి
Gidugu Ramamurthy Life Story in Telugu | Gidugu Ramamurthy Biography in Telugu | Gidugu Ramamurthy | Gidugu Ramamurthy Books in Telugu | Gidugu Ramamurthy Padyalu in Telugu | Vyavaharika Basha in Telugu | Grandhika Basha in Telugu | గిడుగు రామమూర్తి జీవిత చరిత్ర | గిడుగు రామమూర్తి | విశ్వ గురు భారత్ | అఖండ భారత్ | Viswa Guru Bharath | Akhanda Bharath
జాగృతి వారపత్రిక సౌజన్యంతో...
0 Comments