Breaking News

6/recent/ticker-posts

శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ జీవిత చరిత్ర - Sri KS Sudarshanji Life Story in Telugu

 జాతీయవాద ప్రేరకులు.. ‘సంఘ విజ్ఞాన కోశం’.. శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ

 


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఐదవ సర్ సంఘచాలక్ స్వర్గీయ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ పూర్తిపేరు కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్. వారి స్వస్థలం తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో గల కుప్పహళ్ళి గ్రామం. సుదర్శన్ జీ తండ్రి శ్రీ సీతారామయ్య గారు అటవీశాఖ ఉద్యోగి కావడంవల్ల ఎక్కువకాలం మధ్యప్రదేశ్ లోనే గడిపారు.  అక్కడే 1931, జూన్ 18న శ్రీ సుదర్శన్ జీ జన్మించారు. ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల సంతానంలో సుదర్శన్ జీ పెద్దవారు. ఆయన ప్రారంభ చదువు రాయపూర్, దామోహ్, మండ్లా, చంద్రపూర్ ప్రాంతాలలో సాగింది.

 

9 సంవత్సరాల వయస్సులోనే సుదర్శన్ జీ  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖకు వెళ్లారు. 1954లో జబల్ పూర్ లోని సాగర్ విశ్వవిద్యాలయం నుంచి  టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బి.ఈ పట్టా పొందారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు అయిన తరువాత 23 ఏళ్ళ వయస్సులో ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ గా   పూర్తిసమయం సంఘకార్యానికే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. మొట్టమొదట రాయగఢ్ లో బాధ్యతలు నిర్వహించారు.

 

శారీరిక ప్రశిక్షణలో సుదర్శన్ జీ మంచి నైపుణ్యం సంపాదించారు. శారీరిక వర్గ అంటే సుదర్శన్ జీకి ఎంతో ఇష్టం. ఎమెర్జెన్సీ సమయంలో  రెండు సంవత్సరాలు జైలులో ఉన్న సమయంలో కూడా ఆయన శారీరిక్ కు సంబంధించిన పుస్తకాలు చదవడం, అభ్యసించడం చేసేవారు. ఎలాంటి బాధ్యత ఇచ్చినా అందులో కొత్త కొత్త ప్రయోగాలు చేసేవారు. 1969 నుండి 1971 వరకు ఆయన అఖిల భారత శారీరిక్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలోనే ఖడ్గలు, చురిక, బల్లెం వంటి ఆయుధాల శిక్షణకు బదులు నియుద్ధ, ఆసనాలు, ఆటలను సంఘ శిక్షావర్గలో చేర్చారు.

 

1979లో అఖిల భారత బౌద్ధిక్ ప్రముఖ్ గా సుదర్శన్ జీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలోనే కాకుండా నెలకొకసారి జరిగే శ్రేణివారీ బైఠక్ లకు 1979 నుండి 1990 మధ్యకాలంలోనే ఒక వ్యవస్థీకృత రూపం వచ్చింది. ప్రతిరోజూ శాఖలో చదివే `ప్రాతఃస్మరణ’ స్థానంలో `ఏకాత్మతా స్తోత్రం’, దానితోపాటు `ఏకాత్మతామంత్రం’ ప్రవేశపెట్టారు. 1990లో సహ సర్ కార్యవాహగా బాధ్యతలు స్వీకరించారు.

 

దేశంలో మేధావులను జాతీయవాదం వైపు నడిపించడానికి `ప్రజ్ఞా ప్రవాహ్’ అనే సంస్థను స్థాపించడంలో శ్రీ సుదర్శన్ జీ ముఖ్యపాత్ర పోషించారు.

 

‘స్వదేశీ’ అంటే ఆయనకు అభిమానం.  ఆయుర్వేద వైద్య విధానం అంటే ఎంతో గురి. ఆయనకున్న హృద్రోగానికి బైపాస్ సర్జరీ మాత్రమే తరుణోపాయమని డాక్టర్లు చెప్పినా తాజా సొరకాయ రసం, తులసి, మిరియాలు మొదలైనవి సేవించడం ద్వారా ఆరోగ్యాన్ని బాగుపరచుకున్నారు. ‘కాదంబిని’ పత్రిక సంపాదకులైన శ్రీ రాజేంద్ర అవస్థీ, శ్రీ సుదర్శన్ జీ సహాధ్యాయులు. సుదర్శన్ జీ పాటించిన ఆయుర్వేద పద్దతిని కాదంబిని పత్రికలో రెండుసార్లు ప్రముఖంగా ప్రచురించారు. ఈ పద్దతి గురించి అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది.

 

జీవితంలోని చివరి రోజున ఆయన రాయ్ పూర్ కార్యాలయంలో ఉదయం `ఏకాత్మతా స్తోత్రం’ చదువుతున్నప్పుడు ఒక స్వయంసేవక్ అందులో ఒకచోట విసర్గను సరిగా పలకలేదు. ఆ తరువాత సుదర్శన్ జీ అతనిని అక్కడే ఉండమని చెప్పి, ఆ విసర్గతో పాటు చదవడం ఎలాగో అయిదుసార్లు ఆయన చేత అభ్యాసం చేయించారు. అలా చిన్న విషయాలపట్ల కూడా శ్రద్ధవహించడం ఎంత ముఖ్యమో చూపించారు.

 

పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగిన సుదర్శన్ జీ, సర్ సంఘచాలక్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత భోపాల్ వెళ్లినప్పుడు అందరికంటే ముందు తనతో పనిచేసిన ప్రచారక్ ల ఇళ్లకు వెళ్ళి వారిని శాలువా, శ్రీఫలాలతో సత్కరించి గౌరవించారు.

 

ఎంతో విషయ పరిజ్ఞానం కలిగిన శ్రీ సుదర్శన్ జీ కి అనేక భాషలు తెలుసు. పైగా గొప్ప వక్త. అందుకనే ఆయనను `సంఘ విజ్ఞానకోశం’ (Encyclopedia of Sangh) అనేవారు. ఏ విషయమైనా ఆమూలాగ్రం తెలుసుకోవడం ఆయనకు అలవాటు. అందువల్ల ఎలాంటి సమస్యకైనా ఇట్టే పరిష్కారం చూపించగలిగేవారు. పంజాబ్ లో ఖలిస్తాన్ సమస్య, అసోమ్ లో బంగ్లా చొరబాటు వ్యతిరేక ఉద్యమాలపై తన లోతైన విశ్లేషణ, స్పష్టమైన అవగాహన ద్వారా పరిష్కారం సూచించగలిగారు.

 

“హిందువులు, సిఖ్ఖులలో ఎలాంటి తేడా లేదు. ప్రతి కేశధారీ హిందువే. అలాగే ప్రతి హిందువు సిక్కుల పదిమంది గురువులపట్ల, వారి వాణి (సందేశం)పట్ల నమ్మకం ఉంచుతాడు.’’ అని ఆయన స్పష్టంగా చెప్పేవారు. ఇలాంటి ఆలోచనా ధోరణివల్లనే ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమం ఎంత తీవ్రంగా సాగినా పంజాబ్ లో అంతర్యుద్ధం, అంతర్గత పోరు తలెత్తలేదు.

 

ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమ కాలంలోనే `రాష్ట్రీయ సిఖ్ సంగత్’ అనే సంస్థను ప్రారంభించారు. అదే నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు ఒక మంచి వేదికగా మారింది.

 

“బంగ్లాదేశ్ నుంచి వస్తున్న చొరబాటుదారులను వెనుకకు పంపాల్సిందే. కానీ అక్కడ ఎన్నో కష్టనష్టాలకు గురై ఇక్కడకు వస్తున్న హిందూ శరణార్ధులకు మాత్రం ఆశ్రయం కల్పించాలి” అని ఆయన స్పష్టంచేసేవారు.

 

టిబెట్ భారతదేశానికి కేవలం ఒక మిత్రదేశం మాత్రమే కాదు. అది భారత్ కు సోదర దేశంవంటిది. అందుకనే `భారత్ – టిబెట్ సహకార మంచ్’ అనే సంస్థను ప్రారంభించడంలో సుదర్శన్ జీ ప్రముఖ పాత్ర వహించారు.

 

ఇస్లాం, క్రైస్తవ ప్రభావంతో పనిచేసే సంస్థలు జాతీయ భావానికి దూరంగానే ఉంటాయి. ఇది గమనించి ఈ రంగంలో పని చేయాలని జ్యేష్ట కార్యకర్త ఇంద్రేష్ కుమార్ కు సూచించారు. ఆ విధంగా ఆయా వర్గాల్లో పనిచేయడానికి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. జాతీయ భావాలు కలిగిన ముస్లింలు, క్రైస్తవులు ఆ సంస్థల్లో క్రమంగా భాగస్వాములవుతున్నారు. “రాష్ట్రీయ ముస్లిం మంచ్”  ప్రారంభించడంలో శ్రీ సుదర్శన్ జీ ఎంతో చొరవ తీసుకున్నారు.

 

సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ అయిన శ్రీ రజ్జూభయ్యా అనారోగ్య కారణంగా బాధ్యతలను సరిగా నిర్వర్తించలేనని అనిపించినప్పుడు ఇతర జ్యేష్ట కార్యకర్తలతో సంప్రదించి 2000 సంవత్సరం మార్చ్, 10న  అఖిల భారతీయ ప్రతినిధి సభలో శ్రీ సుదర్శన్ జీకి  సర్ సంఘచాలక్ బాధ్యతలు అప్పగించారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 9 సంవత్సరాల తరువాత 2009 మార్చ్ 21న శ్రీ సుదర్శన్ జీ అప్పటి సర్ కార్యవాహ అయిన శ్రీ మోహన్ భాగవత్ జీని ఆరవ సర్ సంఘచాలక్ గా ప్రకటించారు.

 

2012 సెప్టెంబర్, 15న గుండెపోటు కారణంగా శ్రీ సుదర్శన్ జీ రాయపూర్ లో తన తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయస్సు 81 సంవత్సరాలు.

 

శ్రీ సుదర్శన్ జీ భావసుధ:

“దేశం అభివృద్ధి చెందాలంటే జాతీయభావం నిండిన సమాజం ఎంతో అవసరం. మాతృభూమి పట్ల అనన్యమైన ప్రేమ, సమాజం పట్ల ఆత్మీయత, బలమైన సాంస్కృతిక సంబంధాలు, ఈ సంస్కృతిని పరిరక్షించడానికి ప్రాణాలు సైతం అర్పించిన మహనీయుల పట్ల భక్తి మొదలైనవి జాతీయ భావనకు బలమైన ఆధారాలు.”

 

“మన విద్యావిధానంలో సమాచారాన్ని అందించడం పట్లనే దృష్టి పెట్టాం కానీ చదువుతో పాటు ఎంతో ముఖ్యమైన సంస్కారం అందించడం అనే అంశాన్ని మరచిపోయాం.”

 

“మన సమాజంలోని ఒక సమూహాన్ని దళితులు అని పిలవటం ఎంతవరకు సబబు? ఎవరైతే అభివృద్ధికి దూరంగా ఉంటారో వారిలో ఆత్మవిశ్వాసం నింపి, అందరితోపాటు ముందుకు తీసుకువెళ్లడం అవసరం.”

 

“కొందరు రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి వీలైనన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు దీనిని హిందూ-ముస్లిం సమస్యగా చూస్తున్నారు. కానీ ఇది వాస్తవానికి జాతీయ స్వాభిమానాన్ని జాగృతం చేయడానికి సదవకాశం.”

 

“దేశపు సర్వతోముఖాభివృద్ధికి రెండు అంశాలు అవసరం. ఒకటి, దేశం మొత్తాన్ని ఒకటిగా చూడటం, దేశగౌరవాన్ని నిలుపుకోవడం. రెండు, మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే అభివృద్ధి సాధించాలి, సాధించగలుగుతాం అనే ఆలోచన.”

 

“నేడు వందకంటే ఎక్కువ దేశాల్లో హిందువులు జీవిస్తున్నారు. మన ముందున్న జీవిత లక్ష్యం ఏమిటో దానిని స్వీకరించడానికి హిందువులు సిద్ధంగా ఉన్నారా? `సాధారణ జీవనం, ఉన్నతమైన ఆలోచనలు’ అనే అనే ధోరణిని మనం ఎప్పుడు అలవరచుకుంటామో అప్పుడు రాబోయే శతాబ్ది తప్పకుండా హిందువులదే అవుతుంది.”

 

 

సుదర్శన్ జీ గురించి కొందరు ప్రముఖుల అభిప్రాయాలు:

“నేను ఇంతవరకు కలిసిన వ్యక్తులలో అత్యంత పవిత్రమైన వారు”
– శ్రీ సుదర్శన్ జీతో సమావేశమైన అనంతరం అప్పటి ఇరాక్ రాయబారి సాలేహ్ ముక్తార్ ఆయనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య

 

 

“సుదర్శన్ జీ, మనసా, వాచా, కర్మణా సమాజ అభ్యున్నతినే కోరుకున్నారు. హిందూరాష్ట్ర భావనే మమ్మల్ని, ఆయనను వేరు చేసేది. ఆయన ఛాందసవాదానికి వ్యతిరేకి. సంఘకు సంబంధించిన ఇతర సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉండేవో జమాతే ఇస్లామితో కూడా అలాటి సంబంధాలే ఉండేవి”
– రఘు ఠాకూర్, సమాజ్ వాదీ పార్టీ నేత

 

ఆధారం: హమారే సుదర్శన్ జీ (బలదేవ్ భాయ్ శర్మ)(ప్రభాత్ ప్రకాశన్)

Sri KS Sudarshan RSS Biography in Telugu | About KS Sudarshanji in Telugu | RSS Sarsanghachalak KS Sudarshanji in Telugu | KS Sudarshanji | KS Sudarshanji Life Story in Telugu | KS Sudarshanji Biography in Telugu |   శ్రీ సుదర్శన్ జీ గురించి | రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలాక్ శ్రీ కె.ఎస్. సుదర్శన్ జీ | సర్ సంఘచాలాక్ | విశ్వ గురు భారత్ | Viswa Guru Bharath
(నేడు శ్రీ సుదర్శన్ జీ పుణ్యతిధి సందర్భంగా)
 
విశ్వ సంవాద కేంద్రం, తెలంగాణ సౌజన్యంతో..

Post a Comment

0 Comments