1893 సెప్టెంబరు 11... వివేకానంద చికాగోలోని సర్వమత సమావేశంలో ప్రసంగించి చరిత్ర సృష్టించిన రోజు. తర్వాత ఎన్నో నెలలు ఆయన పాశ్చాత్య దేశాల్లో పర్యటించారు. ఎందరో ప్రముఖులు, మేధావులను కలుసుకున్నారు. ఆ పరంపరలో చికాగో నగరంలో అత్యంత ధనికుడైన రాక్ ఫెల్లర్ వివేకానందను కలుసుకోవాలనుకున్నాడు.
ఆ సమయంలో వివేకానంద ఏదో రాసుకుంటూ ఉన్నారు. ఆర్బాటంగా అక్కడకు వచ్చిన రాక్ ఫెల్లర్ తాను చాలా శ్రీమంతుడిని కాబట్టి వివేకానంద ఎదురొచ్చి స్వాగతం పలుకుతాడని అనుకున్నాడు. కానీ అక్కడ అలాంటిదేమీ జరగలేదు. ఆ అక్కసుతో 'నేను ఎంత ధనవంతున్నో నీకు తెలుసా? నేను తలుచుకుంటే మీ దేశానికి తీసుకుపోవడానికి మీకెంత కావాలంటే అంత ధనం ఇవ్వగలను' అన్నాడు.
అప్పుడు వివేకానంద “మీరు కూడబెట్టిన ధనం నిజానికి మీకు చెందింది కాదు. లోకహితార్థం భగవంతుడు ఆ ధనాన్ని మీ దగ్గర దాచి ఉంచాడు. మీరు ధర్మకర్త
మాత్రమే. మీకు అవసరానికి మించి సంపద వచ్చిందంటే అది మీది కాదని అర్థం చేసుకోండి' అని చెప్పాడు. ఇకనైనా కళ్లు తెరిచి మీ దగ్గరున్న డబ్బుతో లోకానికి మంచి చేయండి. అప్పుడే మీ సంపదకు సార్థకత, మీకు మనశ్శాంతి.. 'ఇక మీరు వెళ్లిరండి' అన్నాడు తల ఎత్తకుండా....
రాక్ ఫెల్లర్ ఆత్మగౌరవం దెబ్బతింది. ఇంతవరకు తననలా హెచ్చరించిన వారే లేరు. అందుకే సెలవని కూడా చెప్పకుండా రుసరుసా వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లినా 'ఆ ధనం నీది కాదు.. నువ్వు ధర్మకర్తవు మాత్రమే' అన్న
వివేకానంద మాటలు చెవుల్లో మార్మోగుతున్నాయి. .
వారం గడిచింది. పెద్ద స్వచ్చంద సంస్థకు భారి విరాళం ఇచ్చాడు. ఆ పత్రాలతో స్వామి వద్దకు వచ్చాడు. గతంలోలాగే భేషజంతో ఆయన గదిలోకి అడుగుపెట్టాడు. ఆ కాగితాల్ని వివేకానంద కూర్చున్న బల్లపై పెట్టాడు. 'ఇవిగో .. ఇవి చూడండి. ఇంత సొమ్ము విరాళంగా ఇచ్చినందుకు మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి' అన్నాడు.
అప్పుడు స్వామి వివేకానంద తనదైన శైలిలో మాట్లాడుతూ 'నేను మీకు కాదు, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి. మీ జీవన దృక్పథాన్ని మార్చినందుకు' అన్నాడు.
- చైతన్య,
రామకృష్ణ మఠం
0 Comments