డిసెంబర్ 29 దత్త జయంతి
‘జటాధరమ్ పాండురంగమ్ శూలహస్తం కృపానిధిమ్
సర్వరోగహరమో దేవమ్ దత్త్తాత్రేయ మహంభజే’
భూలోకంలో సాధారణ మానవుడిగా జన్మించి సంపూర్ణ ఇహపర జ్ఞానాన్ని మానవాళికి అందించిన మహత్తర గురువుగా దత్త్తాత్రేయుడు పూజలందుకుంటున్నాడు. త్రిమూర్తుల అంశ. గురువులకే మహా గురువు.
‘అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః
స్మర్తృగామీ స్వభక్తానా ముద్ధర్తా భవసంకటాత్’…. ‘స్మర్తృగామీ’ అంటే తలచిన వెంటనే ప్రసన్నుడవుతాడు’ అని అర్థం. సమస్త ప్రాణకోటికి తనకు తాను అర్పితమైనవాడు (దత్తమైనవాడు) కనుక దత్తుడని, అత్రి మహర్షి వరపుత్రుడు కనుక ఆత్రేయుడని…ఈ రెండు పదాల కలయికతోనే ‘దత్తాత్రేయుడు’గా పేరు పొందారని చెబుతారు. తనకు తానుగా భక్తులకు దత్తమవుతాడు అంటే… భక్తుల అధీనంలో ఉంటాడని అర్థం.
భక్తులకు లోకాన్ని ఏలే తండ్రిగా కంటే పుత్రసమానుడిగా సేవలు అందిస్తాడు. తన మహిమలు చూపడం కంటే భక్తుల మహిమల ప్రదర్శనకు ప్రాధాన్యం ఇచ్చి, వారి కీర్తిని పెంచుతాడట. అందుకే… ‘భక్త కీర్తి వివర్థనుడు’గా కీర్తి పొందాడు. ఆయనను దిగంబరుడు అనీ అంటారు. అంటే నగ్నం అని కాకుండా ‘దిగంతాలనే అంబరాలు’గా చేసుకున్నవాడని అర్థం చెబుతారు. ఏ అవతారానికి లేని ‘గురుదేవ’ అనే విశేషణం దత్త ప్రభువుకు మాత్రమే ఉంది. అరిషడ్వర్గాలు కలి ప్రభావంతో పెచ్చరిల్లుతూ మానవజీవితం పతన దిశగా ప్రయాణించడాన్ని నివారించి మనిషిని మనీషిగా చేయాలన్నదే ఈ అవతార తత్వం. మానవులకు జ్ఞానభిక్ష, ధర్మరక్షణ ఈ అవతార లక్ష్యం కనుక మానవజాతి ఉన్నంత వరకు ఈ అవతారం విలసిల్లుతూనే ఉంటుంది.
కార్తవీర్యార్జునుడు, పరశురాముడు తదితరులు దత్త సంప్రదాయాన్ని అనుసరించారని పురాణాలు పేర్కొంటున్నాయి.అసలు వామదేవుడు అనే రుషి ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారంటారు. ఆయన గురించి ఆసక్తి గల కథనం ప్రచారంలో ఉంది. ఆయన తల్లి గర్భం నుంచి బయటికి చూసి తిరిగి గర్భస్థుడై, దేవతల కోరిక మేరకు జన్మించాడట.
దత్తావతారం గురించి కొన్ని పురాణాలో ఉంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం, సృష్టికార్యాల కోసం సనక, సనందన, సనత్కుమారలను సృష్టించాడట. అయితే వారు అందుకు అంగీకరించకపోవడంతో బ్రహ్మ కోపంతో కళ్లెర్ర చేయగా, ఆయన కనుబొమల నుంచి ‘అత్రి’ జన్మించాడు. అత్రి అంటే త్రిగుణాలకు అతీతుడు. పది మంది బ్రహ్మ మానస పుత్రులలో అత్రి రెండవవాడు. సృష్టి కార్యానికి అవసరమైన శక్తిని సంపాదించేందుకు అత్రి చేసిన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షం కాగా, మీ ముగ్గురు ఒక్కటిగా తన కుమారుడిగా జన్మించాలని కోరి వరం పొందాడు.
మరో కథనం (స్మృతి కౌస్తుభం) ప్రకారం, ఒకనాడు అత్రి, అనసూయ దంపతుల ఆతిథ్యం స్వీకరించిన నారదుడు వైకుంఠం, కైలాస,సత్యలోకాలను సందర్శించిన సందర్భంలో అనసూయను మించిన పతివ్రత సృష్టిలోనే లేరని క్ష్మీపార్వతిసరస్వతులకు చెప్పడంతో, ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని ‘త్రిమాతలు’ త్రిమూర్తులను కోరారు. సరేనంటూ బ్రాహ్మణ వేషధారులుగా వచ్చి భిక్ష అడిగారు. అయితే వివస్త్రగా తమకు వడ్డించాలని షరతు పెట్టడంతో ఆమె వారిని పసిపాపలుగా మార్చి వారి అభీష్టాన్ని నెరవేరుస్తుంది. భర్తల జాడను వెదక్కుంటూ వచ్చిన ‘త్రిమాత’లకు వారిని నిజరూపంతో అప్పగించింది. అనంతరం పొందిన వరంతో మార్గశిర పౌర్ణమి నాడు దత్తాత్రేయ అవతరించారు.
విభిన్నరూపాలు
తనను త్రికరణశుద్ధిగా నమ్మినవారికి శాంతిరూపుడై దర్శనం ఇచ్చినట్లే,
విశ్వాసరహితంగా దర్శించగోరేవారిని భయభ్రాంతులను గొలిపేవారు. వికృత రూపంతో
భయపెట్టడం, తొడపై మహిళను కూర్చుండబెట్టుకున్నట్లు, మద్యం తీసుకుంటున్నట్లు,
ఖండ యోగం ద్వారా శరీర అవయవాలను వేర్వేరు చోట్ల పడేసినట్లు
వ్యవహరించేవారు.అందమైన బాలుడు, వృద్ధుడు, ఉన్మత్తుడు, మద్యపానాసక్తుడు,
అవధూత, యోగి, సిద్ధుడు,మురికి దుస్తులు ధరించిన వికారి,చితాభస్మధారుడు,
తాటిచెట్టు కింద కల్లు ముంత చేపట్టినవాడు, నగలు,పూమాలలతో అలంకార
ప్రియుడిగా…ఇలా భిన్న రూపాలలో దర్శనమిస్తాడు.
ఈ రూపాలన్నీ మానవులలో కనిపించే సహజ లక్షణాలను పోలి ఉంటాయని, భక్తులను, సాధకులను అనుగ్రహించేవేనని అంటారు. అదే దైవం రూపంలో అయితే….మూడు ముఖాలు(త్రిమూర్తులు) ఆరుచేతులు (షట్ శాస్త్రాలు), వెనుక గోవు ( ధర్మం), ఔదుంబర (మేడి) వృక్షం (విశ్వశాంతి), ముందు నాలుగు శునకాలు (చతుర్వేదాలు) దర్శనమిస్తాయి. ముఖ్యంగా అన్ని అపవిత్రాలను పవిత్రం చేసే వేదాలు అలా శునకరూపంలో సాగిలపడడాన్ని బట్టే దత్తమహిమ బోధపడుతుందంటారు. అందుకే ఆయనను ఆరాధించడం, ఆయన పాదుకలను సేవించడం శ్రేయోదాయకమని పెద్దలు చెబుతారు. జాలరి వల విసిరినప్పుడు అతని పాదాల వద్ద చేపలు సురక్షితంగా తప్పించుకోకలిగనట్లే సద్గురు పాదుకల ఆరాధన సద్గతి కలిగిస్తుందని ప్రవచకులు చెబుతారు.
దత్తాత్రేయ ప్రకృతి పరిశీలన ద్వారా పంచభూతాలు, ఏనుగు, చేప, మిడత, సాలెపురుగు తదితర 24 చరాచరాల నుంచి జ్ఞానసముపార్జన చేశారు. భూమి నుంచి క్షమ, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, వాయువు నుంచి నిస్సంగత్వం, జలం నుంచి నిర్మలత్వం, అగ్ని నుంచి తేజస్సు గ్రహించారు. వాటినే గురువులుగా భావిస్తూ వాటిలోని మర్మాలను ఎరిగి లోకానికి వివరించాడు.
దత్తసంప్రదాయం
కులమతవర్గవర్ణ విచక్షణ రహితంగా సర్వులను సమభావంతో చూడడాన్ని దత్త
సంప్రదాయంగా చెబుతారు. జీవులంతా సమానమని, సకలజనులకు సేవలు అందించడం ఆయన
బోధనలుగా ఆరాధకులు అంటారు.
భక్తి, కర్మ, జ్ఞాన, ధ్యానయోగాల సమైక్యత తత్వమే దత్తప్రభువు అవతారం. శ్రీయోగిరాజు,శ్రీ అత్రివరదుడు,శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ కాలాగ్ని శమనుడు, శ్రీ యోగిజనవల్లభుడు, శ్రీ లీలా విశ్వంభరుడు, శ్రీ సిద్ధిరాజు, శ్రీ జ్ఞానసాగరుడు, శ్రీవిశ్వంభరావధూత, శ్రీ అవధూత, శ్రీ మాయాముక్తావధూత, శ్రీ ఆదిగురువు, శ్రీ శివరూపుడు, శ్రీ దేవదేవుడు, శ్రీ దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు. అనేవి ఇతర అవతారాలని శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి దత్త పురాణంలో వివరించారు. సంప్రదాయవాదులు ‘శ్రీగురుదత్త, జై గురుదత్త’అనేది తారకమంత్రం లాంటిది.
దత్తప్రసాదం
దత్తాత్రేయుడికి మేడిపండ్లు ఇష్టమైనవి. ఆయన మేడిచెట్టు కిందనే
నివసిస్తారు.అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఎలుగెత్తారు. యోగసాధనే
మోక్షమార్గమని, మానవమానాలకు పొంగడం, కుంగడంకానీ చేయక మానాన్ని విషతుల్యంగా,
అవమానాన్ని అమృతప్రాయంగా స్వీకరించగలగాలని ఆయన అలర్కుడికి ఉపదేశించారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్
1 Comments
Lord Dattatreya Story in Telugu
ReplyDelete