Breaking News

6/recent/ticker-posts

శకుంతలాదేవి - Shakuntala Devi Biography in Telugu

 

లోకమంతా లెక్కలలోనే, లెక్కలతోనే ఉంది. అయినా- లెక్కించాలన్నా, ఆ చిక్కుముళ్లు విప్పాలన్నా చాలామందికి ఇప్పటికీ గుండె డడ. కొందరికే గణితమంటే మక్కువ ఎక్కువ. ప్రయోగాలు సాగించడం, అవే గణాంకాలతో ఆటలాడటం వారికి రోజువారీ సరదా. అంకెల గారడీ అంటే లెక్కను అటూ ఇటూ తిప్పి, తిమ్మిని బమ్మిని చేయడం. ఓ గారడీలా లెక్కించి, చటుక్కున లెక్క చెప్పడం మాత్రం గణిత పాండిత్యం. మరి అంకెలూ సంఖ్యలను జమిలిగా ఒడిసిపట్టి, కంప్యూటర్లూ కాలిక్యులేటర్లే తెల్లబోయేలా చేసినవారున్నారా? గణిత శాస్త్రాన్నే జీవితంగా భావించి; అందులోనే సత్య సౌందర్యాలను దర్శించి తరించిన వారెవరైనా కనిపిస్తారా? తూకం బతుకులు అంటామే కానీ, తూకం వేసినంత కచ్చితంగా లెక్కలు చేసే ఉద్దండ పిండాలను ఎక్కడైనా చూడవచ్చంటారా? అంటే మటుకు… మనందరి ముందూ నిలిచే, స్మృతిపథంలో ధ్రువతారలా మెరిసే గణితరంగ మహా విదుషీమణి- శకుంతలాదేవి. ఆమె దృష్టిలో- కాదు కాదు… లెక్కలో… గణితమంటే యాంత్రికం కానే కాదు. అదొక సూత్ర సముదాయం. ఇంకా తేల్చి చెప్పాలంటే, జీవన విధానం. అంతటికీ హేతువే ఆలంబన. దీటుగా లెక్క కట్టినంత గట్టిగా గణితశాస్త్రాన్ని తన నిత్యజీవితంతో ముడి వేసుకున్నందుకే తానొక హ్యూమన్‌ ‌కంప్యూటర్‌!

 

‌శకుంతల పేరు- భారతీయ ఆత్మకు సూచిక. ఆమెకు ముందున్న అలనాటి లీలావతి గణితాలు, మహావీర గణిత సార సంగ్రహాలు, అంతకన్నా మించి సున్నాను కనుగొన్న ఆర్యభట్టీయాలు మన కిరీటానికి కలికితురాళ్లు. వంద (శత), వెయ్యి (సహస్ర), పది వేలు (అయుత), లక్ష (నియుత), పది లక్షలు (ప్రయుత). కోటి నుంచి మొదలయ్యే అర్బుద మొదలు న్యార్బుద, సముద్ర, మధ్య, అంత, పరార్థ – ఇవన్నీ భారతీయత ప్రకారం మహా సంఖ్యలు. అంతా ఘన సంఖ్యా వ్యవస్థ. లోతుల్లోకి వెళితే- తృటి=సెకనులో 3290 వంతు. పరమాణు అనేది మరీ చిన్న వ్యవధి. సెకనులో వెయ్యో వంతులో వెయ్యో వంతు మైక్రో సెకను అనుకుంటే, అది 16.8 మైక్రో సెకన్లు. అంక గణిత పరిధిలో కూడిక, తీసివేత, గుణకార, భాగహారాల నిర్వచన కర్త బ్రహ్మగుప్త. కాలచక్ర భ్రమణంలో గణిత సామ్రాట్‌గా పేరొందిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజైన డిసెంబరు 22ను ఆ శాస్త్ర దినోత్సవంగా పరిగణిస్తున్నాం. ఇదే ఆనందదాయక సందర్భంలో శకుంతలమ్మను సైతం తలచుకున్న ఎవరికైనా సగర్వమూ తోడవుతుంది. కారణం ఒక్కటే-శాస్త్రవేత్తల్లో ఆమెది ఈనాటికీ మహారాణి హోదా.

 

ఏకైక శక్తి సంపద

బెంగళూరులో కళ్లు తెరిచి అక్కడే కన్నుమూసిన శకుంతల జీవితకాలం ఎనభై మూడేళ్లు. ఒక్క గణితశాస్త్రంలోనే కాదు… ఖగోళ, జ్యోతిషాది రంగాల్లోనూ మెరుపు వనిత. అత్యంత వేగవంతం అంటే ఇదీ అని నిరూపించిన ‘గణన మానవ మహా యంత్రం’గా ఆమె పేరు నమోదు చేసేటప్పుడు.. విశ్వవిఖ్యాత గిన్నిస్‌ ‌కూడా అమాంతం పొంగి పులకించి ఉంటుంది. దేశ విదేశాల్లో గణితావధానాలు, మ్యాథ్స్ ‌పజిల్స్ ‌వంటి ప్రఖ్యాత పుస్తక రచనలు, పరమాద్భుత ఉపన్యాస పరంపరలు- తన వశమయ్యాయి. మూడేళ్లకే గణిత సంఖ్యల కంఠస్థం, అయిదేళ్లకు క్యూబ్‌ ‌మూలాలు గడగడా లెక్కింపు, వీటన్నింటినీ దాటి ఆరు సంవత్సరాల పసి ప్రాయంలో మైసూరు విశ్వవిద్యాలయ వేదికగా కీలక ప్రదర్శన, ఎనిమిదేళ్లప్పుడు అన్నామలై వర్సిటీ వద్ద ప్రత్యేక కార్యక్రమం.. ఈ అన్నీ బాలమేధావిగా వేనోళ్ల చాటాయి. ఎక్కడిదా జ్ఞాపకశక్తి, ఆ ధారణకు మూలమేమిటి, పదిహేనేళ్లకు లండన్‌ ‌వెళ్లాకా ఎందుకు మారుమోగిందా పేరు? మూడు ప్రశ్నలకీ ఒక్కటే జవాబు-ఆమె శకుంతల కాబట్టి!

 

‘నన్నలా అనకండి!’

ఢిల్లీ, బెనారస్‌ ‌యూనివర్సిటీల్లోనైతే అభిమాన విద్యార్థి సందోహానికి లెక్కే లేదు. బీబీసీలో భారీ పాటవ ప్రదర్శన ఏర్పాటైనప్పుడు మరీ సంచలనం. అటు తర్వాత రోమ్‌లో నిర్వాహకులూ ‘గణిత పరిజ్ఞానంలో మీరే హేమాహేమీ, అందరం అవునంటాం’ అంటూ మరీ మరీ ఒప్పుకోక తప్పింది కాదు. గడచిన శతాబ్దిలోని తేదీ చెబితే, అది ఏ వారమో ఠకీమని సమాధానం. 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతంటే తటాలున స్పందన జవాబు. ఎవరైనా ఆమెను ఆకాశానికి ఎందుకు ఎత్తేయరు? ‘మెదడే గొప్పది. నాదైనా మరెవరిదైనా మనో ప్రజ్ఞను కంప్యూటర్‌తో పోల్చేయకండి’ అనేవారామె వినయంగా. నేను కేవలం శాస్త్రజ్ఞురాలినే కాదు, నాలో రచయిత్రీ ఉంది అన్నట్లు ‘పర్ఫెక్ట్ ‌మర్డర్‌’ ‌పేరిట నేర పరిశోధక నవలనూ వెలువరించారు. ఫన్‌ ‌విత్‌ ‌నంబర్స్ ‌రాశారు. ఆస్ట్రాలజీ ఫర్‌ ‌యూ అన్నారు. 1944లో లండన్‌, 1950‌లో ఐరోపా దేశాలు, 1976లో న్యూయార్క్, 1988‌లో కాలిఫోర్నియా… ఎన్నెన్నో సందర్శనలు. రుచికర పిండి వంటలు చేసేవారు, చేయించి హాయిగా తినేవారు. వాద్య సంగీతమన్నా ఎంతో ఇష్టపడి వినేవారు.

 

ఆత్మవిశ్వాసమంటే అదీ..

ఎక్కడికి వెళ్లినా, ఎన్ని ప్రాంతాలు చూసినా ఆమె చెప్పిన సర్వకాల సూత్రాలు ఇవీ:

–              ప్రతి వ్యక్తికీ ముందుచూపు ఉండాలి, బంధాలు బలపడేది అప్పుడే.

–              నిజజీవితంలో నా లెక్క చాలావరకు తప్పలేదు.

–              గణితంలో మీకు విజ్ఞానం కనిపిస్తుంది. నాకు వినోదంగానూ అనిపిస్తుంది.

–              సామాన్యులకే కాదు, అసామాన్యులకూ కొన్ని సమస్యలు తప్పవు.

–              నన్ను ఏ ఒక్కరూ సవాలు చేయలేరు. అదేదో నాకు నేనే చేసుకోవాలి, అంతే.

–              ఎక్కడైనా నాకు నచ్చినట్లే ఉంటా. ఆత్మవిశ్వాసం అని మీరు పేరు పెట్టుకోవచ్చు.

 

శకుంతలది వికాస సహిత విశ్వాసం. అదెన్నడూ చెదరలేదు, ఆమె బెదిరిందీ లేదు. మైండ్‌ ‌డైనమిక్స్ ‌సిద్ధాంతాన్ని విపులీకరించిన ఆ శాస్త్రకారిణి అన్నివిధాలా డైనమిక్‌ ‌పర్సన్‌. అరుదైన మేధ తనది. జాతి మొత్తానికీ అపురూప నిధి.


- జంధ్యాల శరత్‌బాబు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్
 
 

Post a Comment

1 Comments