భారతనారి- కాంతికి అవతరణం, సృష్టికి అలంకరణం, ప్రజావళికి జాగరణం. రాగమయ ప్రకృతి లోకంలో ఆమె ప్రతి పదమూ రస వైభవమే, ఇంటింటినీ వెలిగించే నిరుపమ దీప ప్రకాశమే. బీదల మొర ఆలకించినా, ధర్మబద్ధంగా పరిపాలించినా, భాగ్యాలు పండించినా, పురోగతిని కలిగించినా… అన్నీ ఆమే. స్పందించడం, ఖండించడం, దండించడం సమస్తం తెలిసి మసలే మహిళామణి- మంగళ విజయవాణి, పలు కళల కల్యాణి. నాయక రాణి, వికాస వాహిని, సాహిత్య వని, సంగీత రసధునిగానే కాదు… వ్యవసాయ, న్యాయ, పారిశ్రామిక, వాణిజ్య, విద్య, వైద్య, ఆర్ధిక, సమాజ సేవ, రక్షణ, హక్కుల పరిరక్షణ, రవాణా, చలనచిత్ర, సంక్షేమ, క్రీడాది రంగాల్లోనూ లలనే మిన్న. తన ప్రాతినిధ్యం సమర్ధం, మమేకం ఆదర్శమయం, నిర్ణాయక శక్తి సంపన్నం, నేతృత్వం స్ఫూర్తిదాయకం. సాధికారతకు పర్యాయపదంగా నిలిచిన వనిత నవాభ్యుదయ సంకేత. ఆ మగువ సారథ్యంతో మాత్రమే జాతి తేజో మూర్తి, రాజిత కీర్తి అవుతుందని ఐక్యరాజ్య సమితి సైతం ప్రగాఢంగా నమ్ముతోంది, దృఢంగా సాగుతోంది. అందుకే ఈ అంతర్జాతీయ వనితా దినోత్సవ (మార్చి 8) ప్రధాన అంశంగా ‘సర్వత్రా మహిళా నాయకత్వం’ అని ప్రకటిస్తూనే, కరోనాపై పోరు నేపథ్యంలో వైద్య సేవలన్నింటికీ పెద్దపీట వేసింది. కరుణారస పరిపూరిత హృదయా, మమతామయ మానవతా నిలయా అంటూ పురోగమన జయకేతనం ఎగురవేసింది. మునుపు ముదితల సమానతకు నినదించిన ఐరాస ఇప్పుడు రంగాలవారీ నాయకత్వ పటిమకే అత్యధిక ప్రాధాన్యమిచ్చి పాలిక-ఏలిక అతివేనని ఢంకా కొట్టి చాటుతోంది.
మహిళా దినోత్సవానికి శతాబ్దికి పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది తొలి నుంచీ స్త్రీ చైతన్యాన్ని పెంచి పోషించే వ్యవస్థీకృత ప్రపంచ పక్రియ. మొదట్లో శ్రామిక సంక్షేమం ప్రముఖంగా ఉంది, సామాజిక రాజకీయ ఆర్థిక ప్రయోజనాలతో ముడివడి కొనసాగేది. అప్పట్లో ఒక్కో దేశం ఒక్కో విధంగా వేడుక నిర్వహణ చేపట్టేది. అనంతర క్రమంలో సమాన హక్కుల సాధన అంశానికి తెరలేచింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా నాడు మార్చి నెలలో ఒక రోజున మహిళా లోకమంతా ఒక్క తాటిపై నిలచి భారీ ప్రదర్శన నిర్వహించింది. అప్పటి నుంచే ఏటా నిర్వహణకు శ్రీకారం చుట్టడం, మన దేశంలో అది బలవత్తరంగా మారడం… ఇదంతా గతం చెబుతున్న సత్యం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆ రోజుల్లోనే అతివల కార్మిక సంక్షేమ సంస్థ ఏర్పాటైంది. అలనాటి వనితా నేతల్లో కెప్టెన్ లక్ష్మి సెహగల్ ఒకరు. సంఘసేవికగా, అంతకు ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉపన్యాసాల వల్ల స్వాతంత్య్ర సమరంలో దూకిన పోరాట యోధగా ఆమె చిర పరిచితురాలు. ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళాదళాలకు కెప్టెన్ హోదా సాధించి, వైద్యురాలి గానూ అనేక సేవా సహాయ సహకారాలు అందించారు. భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన తొలి మహిళగానూ ఎందరికో గుర్తుండే ఉంటారు. తదుపరి పరిణామాల్లో రాజ్యసభ సభ్యురాలు కూడా. అప్పటి నాయకుల్లో మరొకరైన సారాబాయి ఇంకెవరో కాదు, ఆమె సాక్షాత్తు ‘భారత అంతరిక్ష కార్యక్రమ పిత’గా పేరొందిన శాస్త్రవేత్త విక్రం సారాభాయ్‌కి సమీప బంధువు. పెద్దక్క గానూ ఆ వనితా నేతను పిలిచేవారు. తొలిగా ఆడపిల్లల విద్యాలయాన్ని స్థాపించిన తాను పరిణామాల తదుపరి కార్మిక ఉద్యమంలోకి చేరుకుని ఘన విజయాలనెన్నింటినో సముపార్జించారు. మహిళా ఉత్సవమనగానే తలపులోకి చేరే మరో పేరు- బేతా పోజ్నియక్. ఈ హక్కుల ఉద్యమకారిణి ముందరి దశలో నటీమణి. అటు తర్వాత దినోత్సవ నిర్వాహకత్వానికి అమెరికాలో సాధికార పరిగణన సంపాదించిందీ ఆమే.
ప్రచారాంశాల పరంపర
హింసారహిత ప్రపంచం, శాంతి కోసం కృషి, లింగ సమానత్వం, సరి సమాన హక్కులు- అవకాశాలు, సమున్నత విద్య, శిక్షణ వంటి మరెన్నో ప్రచారాంశాలు ఏటేటా వేడుకలకు జత చేరాయి. చారిత్రక నిర్మాణ రంగంలో ఆడవారి ప్రశస్తిని గుర్తించి గౌరవించాలని దశాబ్ది క్రితమే పిలుపునిచ్చింది అమెరికా. మరో సందర్భంలో ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది ఆస్ట్రేలియా. సమితి 2012లో ‘గ్రామీణ మహిళా స్వశక్తీకరణ’ను విస్తార ప్రచారానికి తెచ్చింది. మరో రెండేళ్లకు స్త్రీ సమానత్వమే అందరికీ హితం అనేది అంతటా మారుమోగింది. ఇంకా కొన్ని స్థితిగతుల దరిమిలా క్లినికల్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ రంగ ప్రవేశం చేశారు. శిశువైద్యంలో ఖ్యాతి గడించిన ఆ భారతీయ సంతతి వనితా రత్నం రెండేళ్ల కిందటి దాకా ప్రపంచ ఆరోగ్య సంస్థలో కీలక వైద్య నిపుణురాలు. తమిళనాడు స్వస్థలమైన ఆమె సంస్థ పథకాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హోదా అలంకరించారు. నిరుడు హైదరాబాద్ కేంద్రంగా జీనోమ్ వ్యాలీ సంబంధిత భారత్ బయోటెక్ సంస్థ ఉత్సవంలో సౌమ్య మాట్లాడిన అంశాలేమిటో అందరికీ గుర్తుండే ఉంటాయి. కరోనా నిరోధ, నివారణ వ్యాక్సిన్ అవసరాలపై దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా సవివర చర్చ అన్ని కోణాల్లోనూ జరిగితీరాలని ఆనాడే ఆమె తేల్చి చెప్పారు. వ్యాధి ఎవరికి ఎక్కువగా వస్తుందనేది వైద్య పరిశోధనల ద్వారా అందరూ తెలుసుకోవాలన్నదే తన హెచ్చరిక. పట్టణాల్లో, నగరాల్లో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను విశదీకరించారు. బాధితుల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అప్రమత్తత వహించాలని, భద్రతకే తొలి ప్రాముఖ్యమివ్వాలని ఆమె వైద్య సలహా. వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ, కనీసం రెండేళ్లపాటు జాగ్రత్తగా పూర్వాపర పరిశీలన జరపాలన్నారు. టీకా పని సామర్థ్యంపై సంస్థాగతంగా రూపొందించిన విధి విధానాలనూ సౌమ్య తేటతెల్లం చేశారు. అన్నింటికంటే మిన్నగా, కరోనా నియంత్రణ మీద దేశ ప్రజలను జాగృతం చేయాలన్న ఆమె పిలుపు ఏ ప్రభుత్వానికైనా శిరోధార్యమే. వ్యాధి తీవ్రతను, మరణాల సంఖ్యను తగ్గించే ఔషధాలపరంగా ఆమె చెప్పిన మాటలు, చేపట్టిన చర్యలు ఇప్పటి దినోత్సవ సందర్భంలో ఎంతైనా అభివందనీయాలు.
తరగని ఘన చరిత
భారతీయ వనిత పరిపూర్ణ. జాతి పరువు నిలబెట్టేది, మహాభ్యుదయానికి హారతి పట్టేది, గౌరవాదరాలకు జేజేలు పలికేది అన్నీ ఆమె కాక ఇంకెవరు? ఎంత కఠోర పరీక్షా కాలమైనా, అనుక్షణ నిరీక్షణమైనా ఆ ఓరిమి, బలిమి తనకు మాత్రమే సొంతం. ఎంచుకున్నది ఏ రంగమైనా, ఎదురయ్యేది ఎటువంటి స్థితి అయినా తనది చెక్కుచెదరని చేవ. భాగ్యలక్ష్మిగా వెలుగొందే స్వర్ణ లతిక. భారత జాతి కీర్తిని ఖండాంతరాలు దాటించిన, దాటిస్తున్న పలు రంగాల నారీమణుల సవివర చిత్రణను ఒక్కసారి అవలోకిద్దామా!
సుష్మా స్వరాజ్
కేంద్ర ప్రజా వ్యవహారాలు, భారత విదేశాంగ శాఖలతో పాటు సమాచార, ప్రసార రంగాల్లోనూ తనదంటూ విలక్షణత నిలబెట్టుకున్న మణిపూస సుష్మ. ఈమె వాజపేయి, నరేంద్ర మోదీ మంత్రివర్గాల్లోనూ సభ్యురాలిగా అసాధారణ సమాజసేవ చేశారు. వాటన్నిటి పర్యవసానంగానే దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం పద్మ విభూషణ్‌కు అర్హులయ్యారు. భారత మహిళా రాజకీయ నేతల్లో ఎంతో పేరెన్నిక గన్న తాను ఆ రంగ ప్రవేశానికి ముందు- విద్యార్థి సంఘం నాయకురాలు. ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఆమె ఆ తర్వాత హరియాణా శాసనసభలో తొలి అడుగు మోపారు. కేంద్రంలో ఉండగా విభిన్న సమస్యల పరిష్కారానికి తన న్యాయ శాస్త్ర పరిజ్ఞానాన్ని అన్నివిధాలా వినియోగించుకున్నారు. సంపూర్ణ సామర్ధ్యంతో రాణించిన తను ఇదివరలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం, పార్లమెంటరీ శాఖలను నిర్వహించిన రాజకీయవేత్తగా కూడా ఆ పేరు చిరస్థాయిన ఉంటుంది.
నిర్మలా సీతారామన్
తమిళనాడు పుట్టినిల్లు, తెలుగు రాష్ట్రం మెట్టినిల్లుగా ఉన్న నిర్మలా సీతారామన్ తొలిగా కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమైన రక్షణ, ఆర్థిక శాఖలను అత్యంత సమర్థంగా నిర్వహించారు. పూర్తిస్థాయిలో రక్షణ మంత్రిత్వ శాఖను చేపట్టిన ఘనతా పూర్తిగా ఆమెకే దక్కుతుంది. అంతర్జాతీయ అధ్యయన శాస్త్రంలో పరిశోధన పట్టా పొందిన విశిష్టురాలు. జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధిగానే కాక గతంలో ఒక ప్రపంచ స్థాయి వార్తా సంస్థలోనూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. సాధారణ స్థాయి నుంచి అత్యున్నతమైన, కీలకమైన విధులు చేపట్టే మంత్రి వరకు ఒక్కసారిగా ఎదగడం తన ప్రతిభా పాట వాలకు ‘మెచ్చు’తునక. సముచిత రీతిలో మహిళా రిజర్వేషన్ విధానానికి ముందుకు రావడం తన రాజకీయ జీవితాన్నే మేలిమి మలుపు తిప్పిందంటున్న ఈ నేత భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నిర్వహణలోనూ చెక్కుచెదరని ముద్ర వేశారు. కేంద్ర బడ్జెట్ సమర్పణ తరుణంలో, ప్రసంగ సందర్భంలో పలువురు పార్లమెంట్ సభ్యుల ప్రశంసకు పాత్రులయ్యారీమె.
సుమిత్రా మహాజన్
అనేకసార్లు మధ్యప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన మేటి నాయకి. స్వస్థలంలో అందరి చేతా పెద్ద సోదరిగా పిలిపించుకునే మధుర భాషిణి. ఈమె రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘ రీతిన సాగింది. విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది అనంతరం అదే వృత్తిని చేపట్టిన సుమిత్ర తర్వాత ఇండోర్ నగర పాలక సంఘం ప్రజా ప్రతినిధిగా రాణించారు. లోక్‌సభకు వరుసబెట్టి విజయాలు సాధించడం, ఏళ్ల పర్యంతం కేంద్ర మంత్రివర్గంలో సభ్యురాలిగా పనిచేయడం ఎంతో ప్రత్యేకత. భారతీయ జనతా పార్టీలో విశేష పాత్ర వహించిన నేపథ్యంలో మహిళా స్పీకర్ పదవికి అంతకాలమూ వన్నె తెచ్చి తానేమిటో అందరి ఎదుటా నిరూపించుకున్నారు. ఇదివరలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన పాలనాపరమైన అనుభవజ్ఞురాలు. తన రాష్ట్రానికి సంబంధించి, పార్టీ ఉపాధ్యక్ష విధులనూ చేపట్టిన కార్యదక్ష మహిళ.
స్మృతి ఇరాని
సంచలనాలకు పర్యాయ పదంగా వెలిగిన ఈ నాయకురాలు మునుపటి రోజుల్లో చిన్నితెర నటి. బాల్యం నుంచీ రాష్ట్రీయ స్వయం సేవికా సంఘ్ సభ్యురాలు. అది తాతగారి వల్ల కలిగిన ప్రభావం. భాజపాలో చేరిన ఏడాదికే ఢిల్లీ నుంచి పోటీ చేసిన క్రియాశీలి. అంచెలంచెలుగా పార్టీ జాతీయ కార్యదర్శి స్థానానికి చేరుకున్నారు. మహిళా విభాగానికి అధ్యక్షు రాలిగా స్థానం సుస్థిరం చేసుకున్నారు. నాడు మానవ వనరుల శాఖకు అమాత్యులయ్యారు. తల్లిదండ్రుల ప్రేమ వివాహం, ప్రాంతాలకు అతీతమైన అనురాగ భావన స్మృతిలో విశాల చింతనకు మూలమయ్యాయి. సాధారణ జీవనం, ఆర్ధిక స్థితిగతులు జీవిత వాస్తవికతను బోధించాయి. ఎదురైన కష్టనష్టాలు తన సంకల్ప బలాన్ని పెంచాయే తప్ప తగ్గించలేదు. పెరుగుతూ వచ్చిన ఆత్మధైర్యం ఆమెను రాజకీయ రంగాన ప్రగతిపథంలోనే నడిపించింది, వనితా రత్నంగా దిద్దితీర్చింది. టెలివిజన్ అకాడమీ పురస్కారాలు వరసగా ఐదుసార్లూ చేతికందడమే స్మృతి అభినయ ప్రత్యేకతకు ఉదాహరణలు.
నజ్మా హెప్తుల్లా
విజ్ఞాన శాస్త్రంలో అనేక పరిశోధనలు చేసి, ప్రామాణిక గ్రంథ రచనతో డాక్టరేట్ సాధించిన విశేష ప్రతిభావంతురాలు నజ్మా హెప్తుల్లా. భోపాల్‌కు చెందిన ఈ వివేచనా శీలి ఆనాటి పోరాట వీరుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కి స్వయానా మనుమరాలే. వివిధ కారణాలతో భాజపాలో చేరి అక్కడే స్థిరమైన స్థానం సంపాదించారు. ప్రజాదరణ సాధించిన పర్యవసానంలో ఒకటి కాదు- రెండు మార్లు రాజ్యసభకు ఉపాధ్యక్షురాలయ్యారు. అన్నింటికంటే మించి నరేంద్రమోదీ నేతృత్వంలోని మంత్రివర్గంలో ఒకే ఒక ముస్లిం నాయకురాలిగా పేరొందిన మేటి మహిళ. సభ నిర్వహణలో విలువల పరిరక్షణకు తన వంతు కృషిని పదవిలో ఉన్నంత కాలమూ కొనసాగిస్తూ వచ్చారు.
నిరుపమా రావు
అగ్రదేశం చైనాతో భారత్ సంబంధాలు అనగానే, పాలనా పరంగా ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఈమెదే. ఆ దేశంలో భారత రాయబారిగా ఉన్నప్పుడు, ఇక్కడ విదేశాంగ శాఖ కార్యదర్శిగా వ్యవహరించినప్పుడు గతంలో కొన్నిసార్లు చాలా అనర్గళంగా ప్రసంగించారు. నాటి ఆ ప్రభుత్వ విధాన ఉపన్యాస విశ్లేషణను ఎప్పటికీ ఎవరూ అంత సులువుగా మరువలేరు. సంబంధిత మంత్రిత్వ శాఖకు ఒకప్పటి బాధ్యురాలి హోదాలో నిరుపమ సాధించిన కీర్తి ఇంతా అంతా కాదు. ఆ పాటవానికి, పరిజ్ఞానానికి విద్యావ్యవస్థాగత మూలం తను అప్పట్లో చదివిన హార్వర్డ్ విశ్వవిద్యాలయ బోధనలోనే ఉందని అనుకోవాలి. ఎందుకంటే, దరిదాపు 30 సంవత్సరాల నాడు ఆ వర్సిటీలోనే చదివారీమె. భావాలు అనుభవాలు జమిలిగా కలబోసి, భారత్-చైనా దేశాల నడుమ ఉన్న చరిత్ర సంబంధ రాజకీయాలను గ్రంథ రూపంలో వెలువరించారు.
మీనాక్షి లేఖీ
ఢిల్లీలోని హిందూ విశ్వవిద్యాలయ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించిన ఈమె అటు తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఎందరికో ఆత్మీయురాలు. అక్కడి లోక్‌సభా నియోజకవర్గం ప్రజా ప్రాతినిధ్యమే కాకుండా- ప్రసిద్ధ పత్రికల్లో వ్యాసాలు, టెలివిజన్ షో లలో ఎన్నో చర్చలు ధాటిగా నిర్వర్తించిన ధీర. స్త్రీలు పనిచేసే చోట్ల లైంగిక వేధింపుల నిరోధానికి ఏర్పాటైన ముసాయిదా బిల్లు రూపకల్పన సంఘం లోనూ ప్రముఖురాలు. సూటిగా ప్రశ్నించడమే వృత్తి, ప్రవృత్తిగా ఉన్న మీనాక్షి బీజేపీ అధికార ప్రతినిధిగా మొదటి నుంచీ తనదైన స్థాయి గుర్తింపు సాధించారు. రాజకీయ రంగంతో పాటు వివిధ సామాజిక అంశాలపైనా చేసే వ్యాఖ్యలు ఎప్పుడు విన్నా బహు ఆసక్తికరంగా ఉంటుంటాయి. ముదితలు, బాలల మేలుకు ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకొచ్చి మరీ చురుకుగా పాల్గొనడం తన సహజసిద్ధ స్వభావం. ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షురాలి గానూ బాధ్యతలు వహించి, కాలక్రమంలో మహిళా మోర్చా జాతీయస్థాయి ఉపాధ్యక్షురాలి పదవికి చేరుకోవడం మరింత విశేషమే. వనితా సాధికారతకు రూపుదిద్దుకున్న ప్రత్యేక కార్యబృందం అధ్యక్షురాలిగా ద్విగుణీకృత ఉత్సాహంతో వ్యవహరించారు. అత్యాచారాలు, గృహహింస బాధితుల తరపున వాక్ పటిమతో వాదించి న్యాయ సాధనలో తన సత్తా చాటారు. ఇంకా విలక్షణత ఏమిటంటే, భారత సైన్యంలో శాశ్వత ప్రాతిపదికన మహిళా అధికారుల నియామక అంశంమీద గుక్కతిప్పుకోకుండా కోర్టులో వాదన వినిపించడం!
ఆనందీ బెన్
లఖ్‌నవూలోని ఔషధ పరిశోధన సంస్థకు చెందిన ఒకప్పటి సీనియర్ శాస్త్ర నిపుణుడు డాక్టర్ ప్రదీప్ రాసిన మేలిమి పుస్తకం – బై బై కరోనా. అరుదైన ఈ వైద్య విశ్లేషణ రచనను అక్కడి రాజ్ భవన్‌లో ఆవిష్కరించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ ఎన్నటికీ చరిత్రలో నిలిచే ఉంటారు. భారత్-బ్రెజిల్ సంయుక్త కృషి ఫలితమైన గ్రంథాన్ని తదుపరి పనిలో భాగంగా పోర్చుగీస్ భాషలోకీ తెస్తారని ఆనాడే సభాముఖంగా ప్రకటించారు. దేశంతో పాటు విదేశాల్లోనూ ప్రాధాన్యం పెరిగేలా ఇతర భాషల్లోకి అనువాద పక్రియ ముమ్మరం కావాలన్నారు. ప్రచురణ విస్తరణకు ఇక్కడ మరెన్నో ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని శాస్త్ర, సాంకేతిక విభాగం తరఫున ముద్రితమైన ఈ పుస్తకావిష్కార సమావేశంలో నాటి ఆనందీ ప్రసంగం చక్కని ఆలోచనాత్మకంగా సాగింది. అటువంటి కీలక సమాచారం ప్రజలందరి దరికీ చేరడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పడాలన్నదే ఈమె అంతరంగ తరంగం- ప్రసంగ సారం. విషయమంత టినీ శాస్త్రీయ రీతి బొమ్మల రూపేణా ప్రదర్శించడం అత్యుత్తమ ప్రయోగమన్నారు. సున్నితమైన భావాల వ్యక్తీకరణకు ఇదే ఏకైక సాధనమన్న తన మాట ‘స్వస్థ భారత్’ అనే బంగారు బాటకు దారితీసేదే. ఆ రీత్యా పరిశీలించి చూసినప్పుడు, రాజ్యాంగ హోదాలోని ఆనందీ బాధ్యతాయుత ధోరణి మహిళా దీప కళికే మరి.
హిమా కోహ్లీ
ఎక్కడ ఎన్ని అవాంతరాలు ఎదురైనా అక్కడికక్కడే ధైర్యసాహసాలతో ఎదుర్కొని ముందుకు కొనసాగడమే ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నిశ్చితాభిప్రాయం. మాయదారి మహమ్మారి కరోనా ఇక్కడా అక్కడా అని కాకుండా అనేక చోట్ల బాధాకర అనుభవాలనే మిగిల్చిన సమయంలోనూ న్యాయస్థానం తన విధినిర్వహణకే ప్రాధాన్యమిచ్చిందని… ప్రమాణ స్వీకార అనంతర సభలో అనడం ఈమె నిబద్దతకు అద్దం పడుతుంది. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా, బాధ్యతలను ఎడతెగకుండా వహించడంలోనే అంకితభావన దాగుంటుందని అప్పట్లో అన్నారు. సదవగాహన పెంపొందించడంలో, అనువైన వ్యాధి నియంత్రణ చర్యలకు మూల పాత్ర వహించడంలో తమ కోర్టు క్రియాశీలతను నాడే వివరించి చెప్పారు. అనూహ్య తరుణంలో సైతం న్యాయస్థానాలు ఎక్కడా పని స్తంభించకుండా విధులు కొనసాగించాయన్నారు. పనులన్నీ ఆన్‌లైన్ ద్వారా చేయడానికి అందరం ఉమ్మడిగా పరిశ్రమించామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, అదే కోవలో చికిత్సలూ విరివిగా ఉండేలా కోర్టులు తీసుకున్న శ్రద్ధ వెనక తనవంతు పాత్రా ఏమిటన్నది చెప్పకనే చెప్పినట్లయింది. ఇదే కాకుండా, ఆన్‌లైన్‌లో న్యాయవాదులందరి అండదండలతో ఫలప్రదంగా కేసుల విచారణ పక్రియ వేగవంతం కావడాన్నీ హిమా స్ఫుటంగా ప్రస్తావించారు. త్వరలోనే మళ్లీ పూర్వ స్థితి తథ్యమన్న నాటి తన ఆశాభావం ఇప్పుడూ మహిళామణి అనే పదానికి అర్ధ తాత్పర్యాదులను వెల్లడించడం లేదూ!
సోనియా గాంధీ
భారత జాతీయ కాంగ్రెస్‌కు రెండు దశాబ్దులకు పైగా నాయకత్వం వహించారు. రాజకీయ రంగప్రవేశం జరిగిన ఏడాదికే పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నేతృత్వపరంగా చరిత్ర సృష్టించారు, కాలానుగుణ మార్పుల్లో ఎన్నో తీపి, చేదు అనుభవాలు చూశారు.
మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. కోల్‌కతా విశ్వవిద్యాల యంలో చదువుతూ ఉన్నప్పటి నుంచీ పోరు మార్గమే. ఇస్లామిక్ చరిత్ర, ఉపాధ్యాయ విద్య, న్యాయశాస్త్ర రంగాలలో పట్టాలు అందుకున్న ప్రజ్ఞ. ఎంత నాయకత్వ సంకల్ప బలమో… కొన్ని సందర్భాల్లో అంత జగమొండి తత్వం.
మాయావతి
ఎన్ని అవరోధాలనైనా తట్టుకుని నిలబడగలిగే ధీర నాయకురాలు. ఉపాధ్యాయ విద్య, న్యాయవాద వృత్తి రంగాలలో నిపుణ. ఇదివరకు అమెరికాకు సంబంధించిన పత్రిక సమీకరించిన సమాచారం ప్రకారం- మేటి ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచారు. దేశంలోని ఒక రాష్ట్రానికి (ఉత్తరప్రదేశ్) తొట్ట తొలిగా ఎన్నికైన దళిత వనితగా ఖ్యాతి. బహుజన సమాజ్ పార్టీకి కాంతిరేఖ అయ్యారు. పార్లమెంట్ రెండు సభల్లోనూ ప్రాతినిధ్యం వహించినవారు.
గద్వాల విజయలక్ష్మి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన వనిత. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత కె.కేశవరావు తనయగా రాజకీయ నేపథ్యం.
మోతె శ్రీలత
జీహెచ్‌ఎంసీకి ఉపమేయర్‌గా ఎన్నిక. నగరంలోని మహిళలకు మరింత భద్రత కల్పించడానికే ప్రథమ ప్రాధాన్యమని, అవినీతి పనిపడతామనీ మేయర్‌తో పాటు ఈమె ప్రకటించారు.
ఎస్.జానకి
చలనచిత్ర నేపథ్య గాయనిగా అర్ధ శతాబ్ద కాలంలో యాభై వేల పైచిలుకు పాటలతో తెలుగు వారినే కాక తమిళ, మలయాళ, కన్నడ, తదితర భాషలవారినీ మంత్రముగ్ధులను చేసిన సంగీత రంగ విదుషీమణి శిష్ట శ్రీరామమూర్తి జానకి. నాలుగేళ్ల క్రితం వరకు నిరంతర స్వర జైత్రయాత్ర కొనసా గించిన ఆపాత మధుర గాయనీమణి. ఈమె వీనులవిందైన గాత్రం కారణంగా నాలుగుమార్లు పైగా జాతీయ, మూడు పదులకు మించి అనేక రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయకురాలి పురస్కారాలు కోరి వరించాయి. మూడేళ్ల చిరుత ప్రాయం నుంచే గాన మధురిమలొలికించిన తను అనుదిన ప్రవర్ధమానురాలై సినీ ప్రపంచాన్ని ఏలారు. ఎటువంటి గొంతునైనా అలవోకగా పలికించే జానకి స్వర సంపద ఇప్పటికీ తిరుగులేనిదే. వనితా మహోత్సవ వేళ ఆ మనోహర గానాన్ని మనసులో తలచుకోవడమే ఓ అనిర్వచనీయ సదానుభూతి.
పి.సుశీల
ఐదు జాతీయ, పలు ప్రాంతీయ పురస్కృతులు స్వీకరించిన పులపాక సుశీల గాత్రమాధుర్యం 50 ఏళ్లుగా అలాగే ఉంది. సినీ గాన రంగంలో ఈమె గీతాలూ వివిధ భాషల్లో 50 వేలకు పైమాటే. వృత్తి, ప్రవృత్తి పరంగా ఫలప్రద గాయనీమణి. పదాలు వినసొంపుగా పలకడంలో తనకు తానే సాటి. ఈ గాన కోకిలకు ఇండియన్ నైటింగేల్‌గా పేరు సంపాదించిన లతా మంగేష్కర్‌తో ప్రగాఢ స్నేహం. భక్తి గీతాల ఆలాపనలోనూ విలక్షణత స్థిరపరచుకున్న సుశీల వివిధ దేశాలను సందర్శించారు. సంస్కృత, సింహళ భాషలు, అలాగే హిందీ, బెంగాలీ, పంజాబీలో కూడా పాడిన ప్రతిభావని. ఎన్నో గాన కచేరీలతో ఎందరెందరో శ్రోతలను అలరించారు. తన పేరిట ఏర్పాటైన ట్రస్టు పలువురికి ప్రయోజన కారిగా మారింది. అక్షరాలా గాన సరస్వతి. మునుపే పద్మభూషణ్ పురస్కార స్వీకర్త.
లతా మంగేష్కర్
భారతీయ శాస్త్రీయ సంగీత సీమలో ఈమెది అత్యంత సుస్థిర స్థానం. ఈ హిందీ భాషా గాయని నటిగానూ సుప్రసిద్ధురాలే. అలనాడు ఎన్నడో మొదలైన విజయ యానం తరంతరం నిరంతరంగా సాగుతూ వచ్చింది. 20 భాషలు- 50 వేలకు మించి గీతాలు ఓ దివ్యమైన రికార్డు. మరీ ముఖ్యంగా ‘భారతరత్న’ విజేత. పాటలు పాడటం, వినడం తప్ప వేరే లోకమంటూ లేదు. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎదుట చైనా-భారత్ సమర సమయంలో పాడిన జన జాగృత గీతి ఆయనను భావోద్వేగంలో ముంచెత్తడం అపురూప ఘట్టం. లత నాలుగు చిత్రాలు తీశారు, ఒక మరాఠా సినిమాకు తొలిగా సంగీత సారథ్యం నిర్వహించారు. గాయనీ ప్రపంచ రాణి, మహిళాలోకమణి.
పద్మావతి బందోపాధ్యాయ
భారత వైమానిక దళంలో తొలి వనితా ఎయిర్ మార్షల్ ఈమె. మునుపు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత. ఫెలో ఆఫ్ ద ఎయిరో స్పేస్ మెడికల్ సొసైటీకి ఎంపికైన మొట్టమొదటి పడతిగా రికార్డు సృష్టించారు. వైజ్ఞానిక పరిశోధన రంగంలో సైతం ప్రథమురాలిగా కితాబు పొందారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించిన గొప్ప అనుభవ ముంది. వనితా పరమోన్నతికి ప్రబల ఉదాహరణ.
పి.వి. సింధు
ఈ తెలంగాణ క్రీడాకారిణి పద్మభూషణ్ పురస్కార గ్రహీత. మునుపటి రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ప్రథమ వనిత. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో చోటు చేసుకుని, తొలిమారు మహోన్నత గుర్తింపు అందుకున్నారు. చైనాలో సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పతక సాధన ద్వారా భారతీయ ముదిత సత్తా ఏమిటో ప్రపంచానికి చాటారు. ఎనిమిదేళ్లప్పుడే బ్యాడ్మింటన్ ఆడి క్రీడాప్రతిభ చూపిన ఘటికురాలిగా మహిళాలోక ఆణిముత్యమయ్యారు పూసర్ల వెంకట సింధు.
మేరీ కోమ్
పద్మ విభూషణ్ విజేత ఈ మణిపూర్ క్రీడాకారిణి. మాతృమూర్తి అయ్యాక పాల్గొనలేమని భావించే బాక్సింగ్ పోటీల్లో వరస పతకాలు గెలుచుకున్నారు మేరీ కోమ్. కుగ్రామంలో పుట్టి, తన ప్రతిభా సామర్ధ్యాలతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న జగజ్జెట్టి. సంతానంలో ఒకరు అనారోగ్యం పాలైనా, ఆ క్షోభ భరిస్తూనే రికార్డుల మోత మోగించిన ధైర్య హృదయ. అప్పట్లో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి మహిళా తనే. ఇన్ని విజయాల పర్యవసానంగా రాజ్యసభకు ఎంపికయ్యారీమె.
అందరికీ వందనాలు
వీరితో పాటు- సామాజిక సేవలో కృష్ణమ్మాళ్ (తమిళనాడు), హరేకాల హజబ్బా, తులసి గౌడ (కర్ణాటక), ఉషా చౌమర్ (రాజస్థాన్), సాహిత్యం, విద్యా రంగాల్లో వీణాపాణి మహంతి, దమయంతి బేష్రా (ఒడిశా), మీనాక్షి జైన్ (ఢిల్లీ), కళల్లో ఇందిరా (అసోం), శాంతి జైన్ (బిహార్), లలిత, సరోజ- కాలేషా; (తమిళనాడు); సరిత (మహారాష్ట్ర), పంకజాక్షి (కేరళ), వ్యవసాయంలో రాహిబాయి (మహారాష్ట్ర), ట్రినిటీ (మేఘాలయ)… ఇలా మహిళామణులు ప్రభుత్వం ప్రకటించిన ఉన్నత పౌర పురస్కృతులతో ముందు వరసన నిలిచారు. డాక్టర్ ఇందిరా హిందుజా (గైనకాలజి), అదితి పండిత్ (ఓషనోగ్రఫి), రమణా పరిమళ (ఆల్జీబ్రా), రజనీ ఏ బిఫే (పర్యావరణ మూలక కేన్సర్ పరిశోధన) , ఆరుషి ముద్గల్ (నృత్యం), సోనాల్ మాన్‌సింగ్ (నృత్యం), పద్మా సుబ్రహ్మణ్యం, ఊర్మిళా బల్వంత్ ఆప్టే (స్వచ్ఛంద సేవ), ఫ్లావియా ఆగ్నెస్, కరుణా నంది, మేనకా గురుస్వామి, కామినీ జైస్వాల్ (న్యాయవాదులు), మీనాక్షి జైన్ (పురావస్తు పరిశోధన) వంటివారు ఎందరో మహిళలు ఈ దేశానికి ఖ్యాతి తెచ్చారు. జాతి రత్నాలైన వీరందరి సేవలనూ మనమూ ‘మహిళే మణిదీపం’ అంటూ ముక్త కంఠంతో ప్రస్తుతిద్దాం.
ధన్య జీవని సావిత్రిబాయి ఫులే
మొత్తం 52 పాఠశాలల స్థాపనతో స్త్రీల ఉచిత విద్యకు అత్యధిక ప్రాముఖ్యమిచ్చిన బోధనా నిధి సావిత్రీబాయి. ప్రత్యేకించి వనితల కోసమే విద్యాలయాలు నడిపిన, చైతన్య సంఘాలు స్థాపించిన ఘన యశస్సు పూర్తిగా ఈమెకే చెందుతుంది. అందుకే మహిళా వికాస అధ్యాయంలో వెలుగుల తారగా ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించారీమె. మహారాష్ట్రకు చెందిన ఈ నారీరత్నం పలు కవితలు వెలయించిన సహజ సిద్ధ కవయిత్రి. అన్ని సేవలనూ కొనియాడుతూ 1998లోనే భారత ప్రభుత్వం తపాలా బిళ్లవెలువరించింది. సమాజ సంస్కరణవాదిగా, స్ఫూర్తి ప్రదాయక ఉపాధ్యాయినిగా తాను కలిగించి పెంచి పరిపోషించిన విలువలు అనేకం. సంఘాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను, నానా విధాల హాని చేస్తున్న సంకుచిత తత్వాలను కూకటి వేళ్లతో సహా పెకిలించడం బాలికా విద్యతోనే సుసాధ్యమవుతుందని మనసా వాచా కర్మణా గ్రహించి అనుసరించిన ధన్యజీవి సావిత్రీబాయి. నమ్మిన సూత్రాలను అనుసరిస్తూ, సామాజిక సేవతోనే తరిస్తూ, చరిత సృజించిన క్రాంతి మకుటం. కరవు కోరల్లో చిక్కిన, వ్యాధులూ వ్యధలతో అలమటించిన చిన్నారుల సేవలోనే జీవితం కొనసాగిస్తూ నాడు (1897)మార్చి 10వ తేదీన అసువులు బాసిన ఆ మహనీయ సదా స్మరణీయ.
– జంధ్యాల శరత్‌బాబు
Source - Jagriti Weekly Magazine
1 Comments
మార్చి 8న మహిళా దినోత్సవం
ReplyDelete